Begin typing your search above and press return to search.

ట్రైలర్‌తో డ్యామేజ్.. ప్రీమియర్‌తో రికవరీ!

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ రిలీజ్ కు ముందే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చర్చకు కారణమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 July 2026 11:25 AM IST
ట్రైలర్‌తో డ్యామేజ్.. ప్రీమియర్‌తో రికవరీ!
X

క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఒడిస్సీ రిలీజ్ కు ముందే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చర్చకు కారణమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ డిస్క‌ష‌న్ మొత్తం సానుకూలంగానే సాగిందా అంటే కాదు. సినిమా ట్రైలర్ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో క్యాస్టింగ్ ఎంపికలు, విజువల్ టోన్, క్లాసిక్ కథను నోలన్ ఎలా మలిచార‌నే అంశాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. యూట్యూబ్‌లో ట్రైలర్‌కు భారీ స్థాయిలో డిస్‌లైక్స్ రావడం కూడా ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారాన్ని మరింత పెంచింది. అయితే వరల్డ్ ప్రీమియర్ అనంతరం పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే అభిప్రాయం హాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా ప్రీమియ‌ర్ చూసిన సినీ విమర్శకులు, ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా ప్రతినిధులు సినిమా గురించి చెప్తున్న విష‌యాలు ఇప్పటి వరకు వ‌చ్చిన నెగిటివిటీకి గట్టి బ్రేక్ వేసినట్టుగానే కనిపిస్తున్నాయి. రిలీజ్‌కు ముందే ఏర్పడిన సందేహాలను తగ్గించేలా వచ్చిన ఈ మొద‌టి రెస్పాన్స్ ఇప్పుడు సినిమాకు కొత్త బజ్‌ను తీసుకొస్తున్నాయి.

సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్, కథను భారీ స్థాయిలో ఆవిష్కరించిన తీరు, నోల‌న్ స్పెష‌ల్ విజువల్ స్టైల్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆధారంగా సినిమా గురించి ముందుగానే తీర్పు చెప్పినవారిలో కూడా ఇప్పుడు ఆసక్తి పెరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ట్రైలర్‌పై ఏర్పడిన అభిప్రాయం, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత ఎంత వేగంగా మారిపోవచ్చో ది ఒడిస్సీ రీసెంట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు ఒకవైపు ఉంటే, ప్రీమియర్ త‌ర్వాత వచ్చిన ప్రశంసలు మరోవైపు ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా చుట్టూ పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా ప‌ది రోజులుండగానే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ మొద‌ల‌వ‌డం అడ్వాన్స్ బుకింగ్స్‌కు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొద‌టి రివ్యూలు ఇలానే కంటిన్యూ అయితే బాక్సాఫీస్ ఓపెనింగ్స్‌పై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశాలు లేకపోలేదు.

ఇక డైరెక్ట‌ర్ క్రిస్టోఫర్ నోలన్ కెరీర్ పరంగా కూడా ఈ సినిమా కీలకంగా మారింది. ఓపెన్‌హైమ‌ర్ త‌ర్వాత ఆయన్నుంచి వస్తున్న తర్వాతి సినిమా కావడంతో మొదటి నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రతి సినిమాతో కొత్త అనుభూతిని అందించే డైరెక్ట‌ర్ గా పేరున్న నోలన్, ఈసారి కూడా పురాణ గాథను తనదైన శైలిలో తెరపైకి తీసుకొచ్చార‌నే సంకేతాలను రివ్యూలిస్తున్నాయి. అందుకే ఇది ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా అనే డిస్క‌ష‌న్ ఇప్పటికే ప్రారంభమైంది.

2026లో హాలీవుడ్ నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాల్లో ది ఒడిస్సీ ముందువరుసలో నిలుస్తుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. భారీ బడ్జెట్, ఇంట‌ర్నేష‌న‌ల్ క్యాస్టింగ్, నోలన్ బ్రాండ్ వాల్యూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంచనాలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ట్రైలర్‌కు వచ్చిన ట్రోలింగ్‌తో ప్రారంభమైన జ‌ర్నీ ఇప్పుడు ప్రీమియర్ ప్రశంసలతో కొత్త మలుపు తిరిగింది. యూట్యూబ్ డిస్‌లైక్స్ నుంచి స్టాండింగ్ ఓవేషన్ వరకు సాగిన ఈ మార్పు చివరికి బాక్సాఫీస్ వద్ద కూడా విజయంగా మారుతుందా లేదా అన్నదే ఇప్పుడు సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నగా మిగిలింది. జులై 17న ది ఒడిస్సీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.