Begin typing your search above and press return to search.

డే-1 చైనాలో 'ది ఒడిస్సీ' సంచ‌ల‌నం.. వ‌సూల్ ఎంతో తెలుసా?

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఊపేస్తోంది.

By:  Sivaji Kontham   |   16 Aug 2026 4:22 PM IST
డే-1 చైనాలో ది ఒడిస్సీ సంచ‌ల‌నం.. వ‌సూల్ ఎంతో తెలుసా?
X

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ `ది ఒడిస్సీ` ప్రపంచ చలనచిత్ర రంగాన్ని ఊపేస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ బాక్సాఫీస్ రేసులో అత్యంత కీలకమైన చైనా మార్కెట్‌లో ఈ చిత్రం విడుదలైన తొలిరోజే వసూళ్ల సునామీని సృష్టించింది. సాధారణ హాలీవుడ్ చిత్రాల కంటే భిన్నమైన రీతిలో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ చైనా బాక్సాఫీస్ చరిత్రలోనే నోలన్ కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రారంభాన్ని నమోదు చేసి సరికొత్త రికార్డులకు తెరలేపింది.

చైనా వ్యాప్తంగా నాన్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలకు కేటాయించే రీతిలోనే దాదాపు 20,000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సినిమా నిడివి (రన్-టైమ్) ఎక్కువగా ఉండటం వల్ల మొదటి రోజు కేవలం 57,000 షోలు మాత్రమే ప్రదర్శించినా.. ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్ల వల్ల అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదైంది. తొలిరోజే ఏకంగా 15.9 మిలియన్ల డాల‌ర్ల‌ (రూ. 130 కోట్లకు పైగా) భారీ వసూళ్లను సాధించి.. చైనాలో ఒక హాలీవుడ్ సినిమా సాధించిన అత్యంత అరుదైన ఓపెనింగ్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ చారిత్రాత్మక విజయంలో ఐమ్యాక్స్ నెట్‌వర్క్ అత్యంత కీలక పాత్ర పోషించింది. చైనాలోని దాదాపు 800 ఐమ్యాక్స్ థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించడంతో ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ అనుభూతికై పోటెత్తారు. దీని ఫలితంగా ప్రపంచ సినీ చరిత్రలోనే `అత్యధిక వసూళ్లు సాధించిన ఐమ్యాక్స్ చిత్రం` గా `ది ఒడిస్సీ` అధికారికంగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. నోలన్ అనలాగ్ 70ఎంఎం ఐమ్యాక్స్ మేకింగ్ విజన్ కి చైనా ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

మాస్ మార్కెటింగ్ స్ట్రాటజీ.. అద్భుతమైన విజువల్స్ తో దూసుకుపోతున్న ఈ చిత్రం చైనా మొదటి వీకెండ్‌లోనే 32-35 మిలియన్ల డాల‌ర్ల‌ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం సినీ ప్రియులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తొలి రోజు కనిపిస్తున్న ఈ ఊపు చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం చాలా సులువుగా 1 బిలియన్ డాల‌ర్ (రూ. 8,300 కోట్లకు పైగా) మైలురాయిని అధిగ‌మించిన విష‌యం తెలిసిందే.

మొత్తానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన థియేట్రికల్ ఫార్మాట్‌లో విడుదల చేస్తే లభించే విజయం ఏ స్థాయిలో ఉంటుందో `ది ఒడిస్సీ` మరోసారి నిరూపించింది. హాలీవుడ్ చిత్రాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావడమే కాకుండా.. మునుముందు రోజుల్లో చైనాలో విడుదల కాబోయే ఇతర అంతర్జాతీయ - భారతీయ బిగ్-బడ్జెట్ చిత్రాలకు (ఉదాహరణకు `రామాయణ`, రాజ‌మౌళి వార‌ణాసి వంటి ఐమ్యాక్స్ సినిమాలకు) ఈ చిత్రం ఒక విజయవంతమైన ఆదర్శ నమూనాగా నిలిచింది.