Begin typing your search above and press return to search.

బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో నోలాన్ 'ది ఒడిస్సీ'.. ఈ కేట‌గిరీలో టాప్-5 సినిమాలు ఇవే!

సంచ‌ల‌నాల క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన తాజా దృశ్యకావ్యం `ది ఒడిస్సీ` ప్ర‌పంచ‌ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది.

By:  Sivaji Kontham   |   8 Aug 2026 11:15 AM IST
బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో నోలాన్ ది ఒడిస్సీ.. ఈ కేట‌గిరీలో టాప్-5 సినిమాలు ఇవే!
X

సంచ‌ల‌నాల క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన తాజా దృశ్యకావ్యం `ది ఒడిస్సీ` ప్ర‌పంచ‌ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదలైన కేవలం మూడు వారాల వ్యవధిలోనే ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,514 కోట్లు) వసూళ్ల మైలురాయిని అధిగమించింది. జేమ్స్ కామెరూన్ `అవతార్` ఫ్రాంఛైజీ, మార్వెల్ `అవెంజర్స్` సిరీస్‌ల వంటి ప్రత్యేకమైన ఫ్రాంచైజీల జోరుతో సంబంధం లేకుండా ఈ ఘనత సాధించడం విశేషం.

ఈ అరుదైన విజయంతో `ది ఒడిస్సీ` సినిమా నాన్-అవతార్, నాన్-అవెంజర్స్ చిత్రాల ప్రత్యేక బిలియన్ డాలర్ల క్లబ్‌లో గర్వంగా చోటు సంపాదించుకుంది. ఇప్పటివరకు క్రిస్టోఫర్ నోలాన్ కెరీర్‌లో `ది డార్క్ నైట్` ($1.008 బిలియన్లు), `ది డార్క్ నైట్ రైజెస్` ($1.08 బిలియన్లు) మాత్రమే ఈ క్లబ్‌లో ఉండగా.. ఇప్పుడు `ది ఒడిస్సీ` ఆయన కేరీర్‌లో మూడో బిలియన్ డాలర్ల సినిమాగా రికార్డు సృష్టించింది. ఆస్కార్ విజేత `ఓపెన్‌హైమర్` ఈ మైలురాయికి అతి సమీపంలో ఆగిపోగా.. తాజా సినిమా మాత్రం కేవలం మూడు వారాల్లోనే ఈ టార్గెట్‌ను సులువుగా తాకింది.

ఈ భారీ వసూళ్లలో డొమెస్టిక్ మార్కెట్ నుండి 429.65 మిలియన్ డాలర్లు రాగా ఓవర్సీస్ (అంతర్జాతీయ) మార్కెట్ ద్వారా 578.8 మిలియన్ డాలర్లు లభించాయి. ముఖ్యంగా ఐమ్యాక్స్ స్క్రీన్ల ద్వారానే ఏకంగా 257 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రావడం గమనార్హం. త్వరలోనే ఈ చిత్రం ఐమ్యాక్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్-టైమ్ రిలీజ్‌గా అవతరించడానికి సిద్ధమవుతోంది.

సినిమా జోరు ఇక్కడితో ఆగిపోయేలా లేదు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సినిమా మార్కెట్ అయిన చైనాలో ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. చైనా వ్యాప్తంగా సుమారు 800 ఐమ్యాక్స్ స్క్రీన్లతో పాటు భారీ సంఖ్యలో సాధారణ స్క్రీన్లలో దీన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ రోల్‌అవుట్ పూర్తయితే సినిమా కలెక్షన్ల సునామీ మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుతం `ది ఒడిస్సీ` ఆల్-టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఆర్-రేటెడ్ చిత్రంగా నిలిచింది. `డెడ్‌పూల్ & వోల్వరైన్` ($1.33 బిలియన్లు) సాధించిన రికార్డును అధిగమించి.. అతి త్వరలోనే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ వన్ ఆర్-రేటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది.