హాలీవుడ్ విజినరీ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ టాప్ -5 మేకింగ్ ప్రమాణాలు
హాలీవుడ్‌లో అత్యున్నత దర్శకులలో ఒకరైన క్రిస్టఫర్ నోలన్ తన చిత్రాల విషయంలో తీసుకునే శ్రద్ధ, రియలిజం, సీక్రసీ గురించి పరిశ్రమలో ప్రత్యేకమైన చర్చ జరుగుతుంటుంది.
By: Sivaji Kontham | 27 July 2026 4:00 AM ISTహాలీవుడ్‌లో అత్యున్నత దర్శకులలో ఒకరైన క్రిస్టఫర్ నోలన్ తన చిత్రాల విషయంలో తీసుకునే శ్రద్ధ, రియలిజం, సీక్రసీ గురించి పరిశ్రమలో ప్రత్యేకమైన చర్చ జరుగుతుంటుంది. ఆయన సినిమా తీస్తున్నారంటే అందులో ప్రతి చిన్న విషయాన్ని కూడా అత్యంత పర్ఫెక్ట్‌గా డిజైన్ చేస్తారు. ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి ఆయన పాటించే పద్ధతులు, ఆలోచనా విధానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆశ్చర్యపరుస్తుంటాయి.
నోలన్ తన చిత్రాల కథలు లేదా స్క్రిప్ట్‌లు లీక్ కాకుండా ఉండటానికి అత్యంత కఠినమైన జాగ్రత్తలు తీసుకుంటారు. నటులకు స్క్రిప్ట్ కాపీలు ఇచ్చేటప్పుడు వాటిని ఎవరూ జిరాక్స్ లేదా ఫోటోలు తీయడానికి వీలులేకుండా ఎరుపు రంగు కాగితంపై నల్లటి ఇంక్‌తో ప్రింట్ చేయించి ఇస్తుంటారు. కాపీ మిషన్లు లేదా కెమెరాలు ఈ రంగు కాంబినేషన్‌ను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోవడం వల్ల ఆయన స్క్రిప్ట్‌లు అత్యంత సురక్షితంగా ఉంటాయి.
అంతేకాకుండా.. సినిమాలలో విజువల్స్ సహజంగా ఉండటం కోసం ఆయన విఎఫ్ఎక్స్ (VFX) కంటే రియల్ లోకేషన్లకే ప్రాధాన్యత ఇస్తారు. ఉదాహరణకు తన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ `ఇంటర్‌స్టెల్లార్` చిత్రంలో ఒక సన్నివేశం కోసం సిజిఐ వాడకుండా ఏకంగా 500 ఎకరాల్లో స్వయంగా జొన్న పంటను పండించి ఆ సన్నివేశాలను చిత్రీకరించడం అతడి వర్కింగ్ స్టైల్‌కి ఒక ఉదాహరణ.
ఇక అతడి నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం `ది ఒడిస్సీ` విషయంలో కూడా సంగీతం పరంగా ఒక వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా వాడే పాతకాలపు మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవీ వాడకూడదని.. సౌండ్ వినడానికి చాలా కొత్తగా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్‌కు స్పష్టమైన బ్రీఫ్ ఇచ్చారు. సినిమా కథ పురాతన కాలం నాటి గ్రీస్ నేపథ్యంలో ఉండటంతో సంగీతం కూడా అదే కాలపు అనుభూతిని ఇచ్చేలా ఉండాలని భావించారు.
ఈ ఆదేశంతో సంగీత దర్శకుడు క్రీస్తు పూర్వం 4వ - 5వ శతాబ్దంలో (సుమారు 4000 నుండి 5000 సంవత్సరాల క్రితం) గ్రీస్‌లో వాడిన ప్రాచీన సంగీత వాయిద్యాలను తవ్వి తీసి ఉపయోగించారు. అంతేకాకుండా.. ఈ కథ `బ్రాంజ్ ఏజ్` (కంచు యుగం) లో సాగుతుంది కాబట్టి ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సంగీత కంపోజిషన్ కోసం `బ్రాంజ్` (కంచు) లోహాన్ని కూడా ప్రత్యేకంగా ఉపయోగించారు. ఈ వివరాలన్నీ నోలన్ సినిమా మేకింగ్ పై ఎంతటి అంకితభావంతో ఉంటారో మరోసారి నిరూపిస్తున్నాయి.
