హాలీవుడ్ విజనరీ నోలన్ మతి చెడగొట్టిన ఇద్దరు భారతీయ దిగ్గజ దర్శకులు
ప్రపంచ చలనచిత్ర రంగాన్ని తన వినూత్న ఆలోచనలు, సంక్లిష్టమైన కథనాలతో అబ్బురపరిచే హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ .
By: Sivaji Kontham | 28 July 2026 11:06 PM ISTప్రపంచ చలనచిత్ర రంగాన్ని తన వినూత్న ఆలోచనలు, సంక్లిష్టమైన కథనాలతో అబ్బురపరిచే హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ . తన విజువల్స్, కాన్సెప్ట్‌లతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను మైమరపించే ఈ స్పెషలిస్ట్ ఫిల్మ్‌మేకర్ మతినే పోగొట్టిన ఇద్దరు భారతీయ దర్శకులు ఉన్నారు. వారే ఒకరు ఆస్కార్ గ్రహీత, దివంగత లెజెండ్ సత్యజిత్ రే కాగా, మరొకరు ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటుతున్న దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.
సత్యజిత్ రే భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన తొలి తరం విజనరీ. ఆయన తెరకెక్కించిన `పాథేర్ పాంచాలి`, `చారులత` వంటి చిత్రాలు హాలీవుడ్‌లోని ఎందరో గొప్ప దర్శకులను ప్రభావితం చేశాయి. కథను చెప్పే విధానంలో ఆయన చూపించిన సహజత్వం, భావోద్వేగాల డెప్త్, సినిమాటోగ్రఫీ శైలి క్రిస్టోఫర్ నోలన్‌ను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒకప్పుడు సత్యజిత్ రే చిత్రాలు చూసి నోలన్ ఆయన మేధస్సుకు, ఫిలిం మేకింగ్ ప్రతిభకు ఆశ్చర్యపోయారని చిత్ర సీమలో ప్రచారంలో ఉన్న విషయమే.
ఇక ప్రస్తుత కాలంలో హాలీవుడ్ సైతం భారతీయ సినిమా వైపు తిరిగి చూసేలా చేసింది మన టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రాలతో రాజమౌళి సృష్టించిన సునామీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా `ఆర్ఆర్ఆర్`లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్, మాస్ ఎలివేషన్స్ చూసి నోలన్ వంటి విదేశీ దిగ్గజాలు సైతం రాజమౌళి విజన్, బాక్సాఫీస్ మేజిక్ చూసి నివ్వెరపోయారు.
ఈ ఇద్దరు భారతీయ దిగ్గజాల ఫిలిం మేకింగ్ శైలులను పరిశీలిస్తే ఎంతో వ్యత్యాసం, వేరియేషన్స్ కనిపిస్తాయి. సత్యజిత్ రే సినిమా అంటేనే అత్యంత సహజత్వం, నిశ్శబ్దమైన భావోద్వేగాలు, సమాజంలోని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే కథలు. ఆయన చాలా తక్కువ బడ్జెట్‌లో... కేవలం నటీనటుల హావభావాలు, కెమెరా యాంగిల్స్‌తోనే అద్భుతాలు సృష్టించేవారు. మానవ సంబంధాలు, సమాజంలోని సంక్లిష్టతలను ఎంతో ఆర్ద్రతతో ఆవిష్కరించడం ఆయన శైలి.
దీనికి భిన్నంగా ఎస్.ఎస్. రాజమౌళి శైలి లార్జర్ ద్యాన్ లైఫ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. ఊహకందని భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ప్రేక్షకుడిని థియేటర్‌లో అంచులపై కూర్చోబెట్టడం రాజమౌళి మార్క్. ఇలా ఒకరు క్లాసిక్ మేకింగ్ శైలి- రియలిజంతో.. మరొకరు మాస్ విజువల్ ట్రీట్‌తో ప్రపంచ సినిమాను ఏలుతూ హాలీవుడ్ లెజెండ్స్ మైండ్ బ్లాక్ చేయడం భారతీయ చిత్రసీమకు ఎంతో గర్వకారణం.
