హాలీవుడ్ లెజెండ్ క్రిస్టోఫర్ నోలాన్ సినిమాల్లో నం-1 ఇదే!
అయితే కలల ప్రపంచం నేపథ్యంలో సాగే `ఇన్‌సెప్షన్` చిత్రానికి ఈ జాబితాలో 6వ స్థానం దక్కడం గమనార్హం.
By: Sivaji Kontham | 28 Jun 2026 1:00 PM ISTహాలీవుడ్ లో అత్యంత ప్రభావవంతమైన దర్శకులలో క్రిస్టోఫర్ నోలాన్ ఒకరు. 1998లో వచ్చిన `ఫాలోయింగ్` అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పటివరకు 12 అద్భుతమైన ఫీచర్ ఫిల్మ్స్‌ను ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు అందించారు. లీనియర్ పద్ధతికి భిన్నంగా సాగే నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే, కంప్యూటర్ గ్రాఫిక్స్ స్థానంలో ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం.. హన్స్ జిమ్మర్, లుడ్విగ్ గోరాన్సన్ వంటి దిగ్గజాల సంగీతంతో ప్రేక్షకులను కట్టిపడేయడం నోలాన్ మార్క్ టెక్నిక్.
ప్రముఖ యూట్యూబర్.. సినీ విశ్లేషకులు చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. నోలాన్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రం ఏదో తెలుసుకోవడం అభిమానులకు ఉత్కంఠను కలిగిస్తుంది. నోలాన్ సినిమాల్లో నంబర్ వన్ సినిమాగా `ఇన్‌సెప్షన్`ని ఊహించుకుంటారు. కానీ ఆన్ లైన్ ఓటింగ్ ప్రకారం అతడు తెరకెక్కించిన `ఇంటర్‌స్టెల్లార్` మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతరిక్షం, కాలం, గరుత్వాకర్షణ వంటి సంక్లిష్టమైన సైన్స్ కాన్సెప్ట్‌లతో పాటు తండ్రి-కూతుళ్ల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. కేవలం విజువల్స్ పరంగానే కాకుండా.. థియేటర్లలో ప్రేక్షకుడికి ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చినందుకు గానూ దీనిని ఆల్‌టైమ్ నంబర్-1 క్లాసిక్‌గా రేటింగ్ ఇచ్చారు.
ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో రీసెంట్ ఆస్కార్ సంచలనం `ఓపెన్‌హీమర్`.. సూపర్ హీరో సినిమాల నిర్వచనాన్ని మార్చేసిన `ది డార్క్ నైట్` నిలిచాయి. ఓపెన్ హీమర్ లో అణుబాంబు పితామహుడి జీవితాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా, అద్భుతమైన ఎడిటింగ్, సౌండ్ డిజైనింగ్‌తో నోలాన్ తెరకెక్కించిన తీరు అమోఘం. అలాగే `ది డార్క్ నైట్` చిత్రంలో జోకర్ పాత్రలో హీత్ లెడ్జర్ నటన.. నోలాన్ అందించిన గ్రిప్పింగ్ డ్రామా దీనిని ఎప్పటికీ ఒక బెంచ్‌మార్క్‌గా నిలబెట్టాయి.
`ఇన్‌సెప్షన్` ర్యాంకింగ్‌పై అసంతృప్తి:
అయితే కలల ప్రపంచం నేపథ్యంలో సాగే `ఇన్‌సెప్షన్` చిత్రానికి ఈ జాబితాలో 6వ స్థానం దక్కడం గమనార్హం. చాలా మంది నోలాన్ అభిమానుల దృష్టిలో ఇది నంబర్ 1 స్థానంలో ఉండాల్సిన సినిమా అయినా.. ఈ ర్యాంకింగ్‌లో కిందకు రావడం చర్చనీయాంశమైంది. కొందరు దీనిపై అసంతృప్తిని వ్యక్తపరిచారు. మరోవైపు ఇద్దరు మెజీషియన్ల మధ్య సాగే రివెంజ్ డ్రామా `ది ప్రెస్టీజ్` చిత్రం ఒక అండర్ రేటెడ్ మాస్టర్‌పీస్‌గా 4వ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇందులోని క్లైమాక్స్ ట్విస్ట్, స్క్రీన్‌ప్లే మేజిక్ ప్రేక్షకులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి.
జాబితాలోని మిగిలిన స్థానాల్లో నోలాన్ మొదటి చిత్రం `ఫాలోయింగ్`, సైకలాజికల్ థ్రిల్లర్ `ఇన్ సోమ్నియా`, కాలంతో ప్రయోగాలు చేసిన `టెనెట్`,`మెమెంటో`, `డన్‌కిర్క్` వంటి చిత్రాలు నిలిచాయి. `టెనెట్` సినిమా ఎంత కన్ఫ్యూజింగ్‌గా ఉన్నా... మళ్లీ మళ్లీ చూడాలనే క్యూరియాసిటీని పెంచుతుందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. నోలాన్ సినిమాలకు ఏ ఆర్డర్‌లో ర్యాంకింగ్ ఇచ్చినా.. ఆయన ప్రతి సినిమా వెండితెరపై ఒక సరికొత్త రికార్డును, సరిహద్దులను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నోలాన్ తెరకెక్కించిన తాజా హిస్టారికల్ మైథలాజికల్ డ్రామా `ది ఒడిస్సీ` బాక్సాఫీస్ వద్ద సంచలనాలకు రెడీ అవుతోంది. ఈ సినిమా అతడి టాప్ 5 సినిమాల్లో నిలుస్తుందా లేదా? అన్నది చూడాలి.
