Begin typing your search above and press return to search.

హాలీవుడ్ సినిమాల హవా పెరిగిందా?.. ఇండియన్ బాక్సాఫీస్‌కు కొత్త టెన్షన్!

ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ హాలీవుడ్ సినిమాల ప్రభావం గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   4 Aug 2026 12:53 PM IST
హాలీవుడ్ సినిమాల హవా పెరిగిందా?.. ఇండియన్ బాక్సాఫీస్‌కు కొత్త టెన్షన్!
X

ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ హాలీవుడ్ సినిమాల ప్రభావం గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగిందనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు ప్రధానంగా మెట్రో నగరాల మల్టీప్లెక్స్‌లకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. సూపర్ హీరో ఫ్రాంచైజీలు, సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టకిల్స్, అడ్వెంచర్ సిరీస్‌లు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు పెరుగుతున్న ఆదరణ హాలీవుడ్ మార్కెట్‌ను మరింత విస్తరించింది.

ఈ నేపథ్యంలో క్రిస్మస్ 2026 బాక్సాఫీస్ పోటీ సాధారణ రిలీజ్ క్లాష్‌గా కాకుండా, భారతీయ సినిమా మార్కెట్ మారుతున్న స్వభావాన్ని పరీక్షించే ఘట్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. భారీ హాలీవుడ్ రిలీజుల మధ్య షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా త‌న రిలీజ్ డేట్ ను మార్చకుండా ముందుకు వెళ్లడం కేవలం డేరింగ్ డెసిష‌న్ గా మాత్ర‌మే కాకుండా, ఒక స్ట్రాట‌జిక్ బిజినెస్ మూవ్‌గా కూడా విశ్లేషకులు చూస్తున్నారు.

గత కొన్నేళ్లలో మార్వెల్, అవతార్, జురాసిక్, మిషన్ ఇంపాజిబుల్ వంటి ఫ్రాంచైజీలు ఇండియ‌న్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. ముఖ్యంగా పాన్ ఇండియా డబ్బింగ్, ఐమ్యాక్స్, ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్‌ల విస్తరణ హాలీవుడ్ సినిమాల‌కు అదనపు బలాన్ని అందించాయి. దీంతో భారీ హాలీవుడ్ సినిమాలు రిలీజ‌య్యే టైమ్ లో స్క్రీన్‌ల కేటాయింపు, షోల పంపిణీ, ప్రీమియం టికెట్ ధరలు వంటి అంశాలు కూడా కీలకంగా మారుతున్నాయి.

అయితే ఇదే పరిస్థితి ఇండియ‌న్ స్టార్ సినిమాలకు సవాలుగా మారుతుందనే అభిప్రాయం పూర్తిగా సరైందని చెప్పలేం. దేశీయ సినిమాల‌కు ఫ్యామిలీ ఆడియ‌న్స్, రీజ‌న‌ల్ మార్కెట్లు, స్టార్ ఫాలోయింగ్, పండుగ సీజన్ సెంటిమెంట్ వంటి స్పెష‌ల్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. అందుకే కొన్ని భారీ బాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ పోటీని ఎదుర్కొనేందుకు వెనుకడుగు వేయడం లేదు. రిలీజ్ డేట్ ను మార్చకుండా ఉండ‌టానికి మరో కారణం కూడా ఉంది. భారీ బడ్జెట్ సినిమాల‌కు క్రిస్మస్ వంటి హాలీడే విండో ఎంతో విలువైనది. స్కూల్ హాలీడేస్, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ర‌ష్, విజిటింగ్ సీజన్ కలిసి వచ్చే ఈ సీజ‌న్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఒకసారి రిలీజ్ ను పోస్ట్‌పోన్ చేస్తే త‌ర్వాత మ‌ళ్లీ అనుకూల రిలీజ్ డేట్ దొర‌క‌డం కూడా అంత ఈజీ కాదు.