సినిమా సెట్స్‌పై 8 గంటల పనివేళలు సాధ్యమేనా? సీనియర్ నటి కామెంట్!
సినీపరిశ్రమలో పనివేళలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. పని-వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం సెట్స్‌పై 8 గంటల షిఫ్టులు ఉండాలని దీపికా పదుకొణె చేసిన ప్రతిపాదనపై చాలా మంది సహచరులు తమ అభిప్రాయాలను చెప్పారు.
By: Sivaji Kontham | 28 April 2026 9:42 AM ISTసినీపరిశ్రమలో పనివేళలపై జరుగుతున్న చర్చ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. పని-వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం సెట్స్‌పై 8 గంటల షిఫ్టులు ఉండాలని దీపికా పదుకొణె చేసిన ప్రతిపాదనపై చాలా మంది సహచరులు తమ అభిప్రాయాలను చెప్పారు. కంగన సహా కొందరు దీపికను సమర్థిస్తే, మరికొందరు తనను వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ డిబేట్ పై సీనియర్ నటి చిత్రంగదా సింగ్ స్పందించారు. సినిమా అనేది ఒక సృజనాత్మక రంగమని.. ఇక్కడ గడియారం ముల్లుతో పనిని కొలవడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న `మాతృభూమి`సినిమా ప్రచారంలో భాగంగా చిత్రాంగద పని గంటలపై చేసిన విశ్లేషణ ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది.
సినిమా చిత్రీకరణ అనేది చాలా ఇతర బాహ్య అంశాలపై ఆధారపడి ఉంటుందని చిత్రంగదా వివరించారు. షూటింగ్ సమయంలో వాతావరణ మార్పులు.. సాంకేతిక సమస్యలు లేదా లైటింగ్ సరిగ్గా లేకపోవడం వంటి అనుకోని అడ్డంకులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఒక ముఖ్యమైన షాట్ మధ్యలో ఉన్నప్పుడు లేదా లైటింగ్ అనుకూలంగా ఉన్నప్పుడు.. కేవలం ఎనిమిది గంటలు పూర్తయ్యాయని పని ఆపేయడం సృజనాత్మక ప్రక్రియకు విఘాతం కలిగిస్తుందని వాదించారు. క్రియేటివిటీని సమయంతో బంధించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
కేవలం సృజనాత్మకత మాత్రమే కాకుండా.. సినిమా వెనుక ఉండే వ్యాపార కోణాన్ని కూడా మనం విస్మరించలేమని చిత్రంగదా గుర్తుచేశారు. నిర్మాత కోణం నుండి చూస్తే.. చిత్రీకరణ ఆలస్యమయ్యే కొద్దీ బడ్జెట్ పెరుగుతుందని.. ఇది ప్రాజెక్టుపై భారం చూపుతుందని చిత్రాంగద అన్నారు. ``దీపికా పదుకొణె ఒక సూపర్ స్టార్.. ఆమె ఎనిమిది గంటలే పనిచేస్తానని చెబితే అది చెల్లుతుంది. కానీ అందరి విషయంలో అది సాధ్యం కాకపోవచ్చు`` అని పేర్కొంటూ..నటీనటుల హోదాను బట్టి పరిస్థితులు మారుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ చర్చలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే.. నటీనటుల కంటే సాంకేతిక నిపుణులకే పనివేళల క్రమబద్ధీకరణ అవసరమని చిత్రంగదా బలంగా చెప్పారు. లైట్‌మెన్, కెమెరా అసిస్టెంట్లు.. ఇతర యూనిట్ సభ్యులు అందరికంటే ముందుగా సెట్‌కు వస్తారని.. అందరూ వెళ్ళిన తర్వాత చివరగా వెళ్తారని చిత్రాంగద గుర్తుచేశారు. వారు చేసే శ్రమకు తగిన విశ్రాంతి.. నిర్ణీత సమయం ఉండాలని.. నటీనటుల కంటే వారికే ఈ నిబంధనలు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయని వివరించారు.
పరిశ్రమలో పనివేళల విషయంలో ఒక నిర్మాణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని చిత్రంగదా పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆర్ట్ - లైటింగ్ విభాగాల్లో పని చేసే వారికి సరైన సమయపాలన లేదని.. అందరూ కలిసి దీనిపై ఒక నిర్ణయానికి రావాలని చిత్రాంగద కోరారు. కేవలం నటీనటుల కోసమే కాకుండా.. సినిమా నిర్మాణంలో పాలుపంచుకునే ప్రతి విభాగం గౌరవప్రదమైన పనివేళలను పొందేలా చర్యలు తీసుకోవాలని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సల్మాన్ - చిత్రాంగద జంటగా `మాతృభూమి` మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. ఇండియా - చైనా బార్డర్ గల్వాన్ లోయలో జరిగిన సైనిక ఆపరేషన్ నేపథ్యంలో అంతర్లీనమైన సైనికుడి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. చైనాతో సత్సంబంధాల దృష్ట్యా ఈ సినిమాలో ఆ దేశాన్ని విలన్ గా చూపించడం కుదరకపోవడంతో ఇప్పుడు దానిని పూర్తి ప్రేమకథగా స్క్రిప్టును మార్చి రీషూట్లు చేసారని కథనాలొచ్చాయి.
