సమంత-నిధి ఘటనలు.. 'మాబింగ్' కల్చర్‌పై నటి ఫైరింగ్!
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి చిత్రంగద చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.
By: Sivaji Kontham | 11 Jan 2026 6:00 AM ISTగత కొద్ది రోజులుగా మాబింగ్ గురించి పెద్ద చర్చ సాగుతోంది. సమంత, నిధి అగర్వాల్ ఘటనలతో దీనికి అధిక ప్రాచుర్యం లభించింది. గతంలో అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ (ముంబైలో), రామ్ చరణ్ వంటి వారు ఎయిర్‌పోర్టులలో మాబింగ్‌కు గురయ్యారు. దళపతి విజయ్ మలేషియాలో క్షేమంగా జననాయగన్ ప్రీరిలీజ్ వేడుకను ముగించి, చెన్నై విమానాశ్రయంలో మాబింగ్ కి గురయ్యారు. అభిమానుల తోపులాటలో కింద పడిపోయిన విజువల్స్ వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటి చిత్రంగద చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. వీటికి ఇతర సెలబ్రిటీల నుండి కూడా మద్దతు లభిస్తోంది. చిత్రాంగద `మన శంకరవరప్రసాద్ గారు` సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ పోషించారని టాక్ వచ్చిన సందర్భంగా ఇప్పుడు మరోసారి చర్చల్లోకి వచ్చింది. 49 ఏళ్ల వయసులో కూడా పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో గుబులు పుట్టించే చిత్రాంగద మాబింగ్ పై ఇంకా ఏమన్నారంటే?
అభిమానం పేరుతో సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని ఈ నటి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. అభిమానులు ఫోటోలు- సెల్ఫీల కోసం రావడం మాకు ఆనందాన్నిస్తుంది. కానీ విమానాశ్రయాల్లో, ఇతర ఈవెంట్లలో వందలాది మంది ఒక్కసారిగా చుట్టుముట్టడం వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది.. దానిని గౌరవించాలని పేర్కొన్నారు.
సెల్ఫీ తీసుకోవాలనే ఆరాటంలో కొందరు సెలబ్రిటీలను తోసేయడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు. ఇది కేవలం అసౌకర్యం మాత్రమే కాదు..కొన్నిసార్లు ప్రమాదకరం! కూడా అని చిత్రాంగద ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో మాబింగ్ ఘటనను ఉదాహరణగా తీసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ కంటెంట్ సృష్టికర్తలేనని ఫాలోవర్ల కోసం సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీయడం ఫ్యాషన్ అయిపోయిందని చిత్రాంగద విమర్శించారు. సెలబ్రిటీల పట్ల హుందాగా వ్యవహరించాలని కోరారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే, చిత్రంగద సింగ్ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్‌లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దీని షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జరుగుతోంది.
