కొత్త కొత్తగా..80స్ స్టార్స్ రీయూనియన్..
రీయూనియన్ పార్టీతో 80స్ సినీ తారలు మళ్లీ ఒకే చోట కనిపించారు. ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు తరచూ రీయూనియన్ పేరుతో కలుస్తున్నారు.
By: M Prashanth | 5 Oct 2025 1:48 PM ISTరీయూనియన్ పార్టీతో 80స్ సినీ తారలు మళ్లీ ఒకే చోట కనిపించారు. ఎన్నో ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న వారు తరచూ రీయూనియన్ పేరుతో కలుస్తున్నారు. ఆ సమయంలో గేమ్స్ ఆడుతారు.. డ్యాన్సులు చేస్తారు.. పార్టీ చేసుకుంటారు. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తు చేసుకుని.. ఓ రేంజ్ లో వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈసారి అందుకు చెన్నై వేదికగా మారింది. శనివారం రాత్రి అనేక మంది సినీ తారలంతా రీయూనియన్ వేడుకలను జరుపుకున్నారు. ఒకే చోట చేరి తారలు వారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంత్యాక్షరితో పాటు కొన్ని ఇండోర్ గేమ్స్ తో సందడి నెలకొల్పారు. పాన్ ఇండియా స్థాయిలో నటీనటులంతా పాల్గొన్నారు.
ఆ సమయంలో దిగిన గ్రూప్ ఫోటోలు తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నటీనటులందరితో తీసుకున్న ఫోటోతోపాటు కేవలం నటులతో దిగిన పిక్ ను పంచుకున్నారు. సినిమా చరిత్రలో అత్యుత్తమ రీయూనియన్ అని తెలిపారు. ప్రియమైన తారలు తిరిగి కలిసి మధురమైన క్షణాలు ఆస్వాదించామని చెప్పారు.
ఎన్నో అందమైన జ్ఞాపకాలు అని, ప్రతి సమావేశం మొదటిదిలానే కొత్తగా అనిపిస్తుందని చిరు చెప్పుకొచ్చారు. అయితే ఈసారి రీయూనియన్ కు చిరుత థీమ్ అవుట్ ఫుట్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు పిక్స్ ద్వారా తెలుస్తోంది. వేడుకలకు హాజరైన నటీనటులంతా చిరుత థీమ్ డ్రెస్సుల్లో కనిపించి అంతా సందడి చేశారు.
కాగా, 80స్ స్టార్స్ రీయూనియన్ 2009లో స్టార్ట్ అయింది. అప్పుడు లిస్సీ, సుహాసిని ఆ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలు మార్లు వేడుకలు జరగ్గా.. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీ యూనియన్ పార్టీని నిర్వహించారు. అయితే 2022లో చివరి రీ యూనియన్ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.
అప్పుడు బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ పార్టీ హోస్ట్ చేయగా.. గత రెండేళ్లుగా పార్టీ జరగడం లేదు. 2024లో చెన్నైలో అనుకున్నారు. కానీ వరదల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు అక్కడే మళ్లీ పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. ఈ సారి కోలీవుడ్ స్టార్ జంట రాజ్ కుమార్- శ్రీప్రియ తమ ఇంట్లోనే ఏర్పాటు చేశారు.
ఈ సారి వేడుకల్లో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, వెంకటేష్ పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్రైట్ లో చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నరేష్, రమ్యకృష్ణ, జయసుధ, సుమలత, మీనా, శరత్‌కుమార్, నదియా, లిస్సీ, శోభన, మేనక, సురేశ్, భాను చందర్, ప్రభు, రెహ్మాన్, రేవతి, రాధ, సుహాసిని, ఖుష్బూ అటెండ్ అయ్యారు. అంతా క్రేజీ లుక్స్ లో కనిపించారు.
