చిరంజీవి-శ్రీకాంత్ సినిమాకు రెహమాన్ సంగీతమా?
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ లాక్ అయిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 26 Jan 2026 11:50 PM ISTమెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే సినిమా ప్రారంభం కావాలి. కానీ చిరు-శ్రీకాంత్ వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో సాద్యపడలేదు. సెట్స్ కు వెళ్లడానికి ఇంకా కొన్ని నెలలు సమయం పడుతుంది. అయితే ఈసినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుద్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో? శ్రీకాంత్ అనిరుద్ ని పట్టుబట్టి మరీ ఒప్పించాడనే ప్రచారం జరిగింది.
అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి అనిరుద్ తప్పుకున్నాడు అని వార్తలొస్తున్నాయి. ఆ స్థానంలో స్వరమాంత్రికుడు ఏ.ఆర్ . రెహమాన్ ని ఎంపిక చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. అదే నిజమైతే చిరంజీవి కోరిక తీరినట్లే. రెహమాన్ తో పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. చిరంజీవి పాన్ ఇండియా చిత్రం `సైరా నరసింహారెడ్డి`కి రెహమాన్ సంగీతం అందించాలి. రెహమాన్ కూడా అడ్వాన్స్ తీసుకున్నాడు. కానీ చివరి నిమిషంలో బిజీ షెడ్యూల్ కారణంగా రెహమాన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి చిరు..రెహమాన్ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు? అనే ప్రచారం అప్పట్లో వేడెక్కించింది.
చిరంజీవి ఇక రెహమాన్ కు అవకాశమే ఇవ్వరు? అన్న రేంజ్ లో ప్రచారం జరిగింది. కానీ రెహమాన్ బాండింగ్ ఇప్పుడు మెగా ఫ్యామిలీతో బాగుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తోన్న `పెద్ది` సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సంగీతంపై టేస్ట్ ఉన్న బుచ్చిబాబు వల్లే ఇది సాధ్యమైంది. ఇప్పటికే రెహమాన్ బాణీలు సమకూర్చిన `చికిరి చికిరి` సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో? తెలిసిందే. రెహమాన్ ఈజ్ బ్యాక్ అనిపించేలా ఆ పాట సక్సెస్ అయింది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డలు నమోదు చేసింది.
రెహమాన్ నుంచి తదుపరి రిలీజ్ అయ్యే పాటలు ఇంతే హైప్ ఇస్తాయని మెగా అభిమానులు కాన్పిడెంట్ గా ఉన్నారు. ఇవన్నీ చూసే చిరంజీవి-శ్రీకాంత్ రెహమాన్ ని దించాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నట్లు వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజా నిజాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం అనిరుద్ కూడా పుల్ ఫామ్ లో ఉన్నాడు. చిరంజీవి లాంటి లెజెండ్ తో ఛాన్స్ అంటే అతడు అంత సులభంగా వదులకోడు. బిజీగా ఉంటే తప్ప అది సాద్యం కాదు. మరి నెట్టింట జరుగుతోన్న ప్రచారం వెనుక అసలు నిజాలు తెలిస్తే గానీ క్లారిటీ రాదు.
