పవన్ బర్త్ డే.. మెగా బాండింగ్ పిక్ వైరల్!
టాలీవుడ్‌లో మాస్, క్లాస్ ఆడియన్స్ అందరినీ సమానంగా ఆకట్టుకునే ఇద్దరు లెజెండ్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
By: M Prashanth | 2 Sept 2025 10:22 AM ISTటాలీవుడ్‌లో మాస్, క్లాస్ ఆడియన్స్ అందరినీ సమానంగా ఆకట్టుకునే ఇద్దరు లెజెండ్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా రంగంలో స్టార్ హీరోలుగా ఎన్ని విజయాలు సాధించినా, వీరిద్దరి బంధం ఎప్పుడూ ప్రత్యేకమే. అన్నదమ్ముల ఆప్యాయతతోపాటు, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం తరచూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అలాంటి ఘట్టం మరోసారి వెలుగులోకి వచ్చింది. సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ స్థానం ప్రత్యేకం. జనసేనాని గా ప్రజల్లో తనకంటూ వేరే రేంజ్ క్రేజ్‌ను ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ప్రజల సమస్యలపై నేరుగా స్పందిస్తూ, సేవలందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2వ తేదీన ఆయన బర్త్‌డే మరింత స్పెషల్ గా మారింది. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. "చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ఆయన రాసిన హృదయపూర్వక సందేశం ఫ్యాన్స్ హృదయాలను హత్తుకుంది.
“ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం” అని అన్నదమ్ముల బంధాన్ని ప్రతిబింబించేలా తన ప్రేమను వ్యక్తపరిచారు. అంతేకాక, పవన్ చిరకాలం ప్రజల కోసం ఆరోగ్యంగా, అభిమానం నిండుగా ఉండాలని ఆశీర్వదించారు. "దీర్ఘాయుష్మాన్ భవ!" అంటూ తన ట్వీట్‌ను ముగించారు. దీనికి జోడించిన పాత ఫోటోలో చిరంజీవి, పవన్ కలిసి కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
బ్లూ కలర్ స్వెట్టర్లలో కౌగిలించుకుని ఉన్న ఈ రేర్ పిక్ అన్నదమ్ముల ఆత్మీయతను చూపిస్తోంది. పవన్ కెరీర్ మొదట్లో తీసిన ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతూ, వారి బంధానికి ప్రతీకగా నిలిచింది. పవన్ బర్త్‌డే సందర్భంగా ఈ పిక్‌ను జోడించి చిరంజీవి చేసిన విషెస్ ఫ్యాన్స్ హృదయాలను తాకేశాయి. ఇక ఫ్యాన్స్, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పవన్‌కు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అయితే అన్నయ్య నుంచి వచ్చిన ఈ మెసేజ్ మాత్రం అన్ని విషెస్‌లో హైలైట్ అయింది.
