చిరు వర్సెస్ ప్రభాస్.. అసలు టెన్షన్ ఇదే
ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో బరిలోకి దిగుతున్నాయంటే ఫ్యాన్స్ కు పండగే.
By: M Prashanth | 21 Oct 2026 12:02 PM ISTఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో బరిలోకి దిగుతున్నాయంటే ఫ్యాన్స్ కు పండగే. కానీ ఆ ప్రాజెక్టుల మీద వందల కోట్లు కుమ్మరించిన ప్రొడ్యూసర్ల పరిస్థితి మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ ఫౌజీ విషయంలో సరిగ్గా ఇలాంటి సీన్ కనిపించేలా ఉంది. ఈ రెండు భారీ చిత్రాలు 2027 మార్చి నెలనే టార్గెట్ చేసుకుంటున్నాయనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. హీరోల మధ్య పోటీ కంటే కూడా, ఆ సినిమాల వెనుక ఉన్న భారీ పెట్టుబడులే ఇప్పుడు ట్రేడ్ లో అసలైన హాట్ టాపిక్ గా మారాయి.
2026 సంక్రాంతి సీజన్ లో రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాలతో ప్రభాస్, చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి సినిమాలు అతి తక్కువ గ్యాప్ లో వస్తున్నాయనే టాక్ నడుస్తోంది. పండగ టైమ్ లో ఎన్ని సినిమాలు వచ్చినా జనాలు థియేటర్లకు ఎగబడతారు, లాంగ్ వీకెండ్స్ కలిసివస్తాయి. కానీ మార్చి సీజన్ లో అలాంటి వెసులుబాటు ఏమాత్రం ఉండదు. దానికి తోడు ఈ రెండు సినిమాల బడ్జెట్లు, మేకింగ్ కోసం పట్టిన సమయం కూడా కీలకం కానున్నాయి.
విశ్వంభర సినిమా విషయానికి వస్తే షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా గ్రాఫిక్స్ పనుల వల్లే రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం కోసం భారీ సెట్స్, వీఎఫ్ఎక్స్ పై భారీగా ఖర్చు పెట్టారు. రిలీజ్ ఆలస్యమయ్యే కొద్దీ పెట్టుబడులపై వడ్డీల భారం పెరిగిపోతూ ఉంటుంది. ప్రమోషన్లకు అదనపు ఖర్చులు కూడా తోడవుతాయి. ఇలాంటి భారీ చిత్రానికి మొదటి వారం రోజుల్లోనే భారీ రికవరీ రావడం నిర్మాతలకు అవసరం.
ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ కూడా మామూలు కాన్వాస్ తో రావడం లేదు. ఇదొక పీరియడ్ వార్ డ్రామా కావడంతో రస్టిక్ సెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్, భారీ తారాగణం కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముందుగా డిసెంబర్ 2026 అనుకున్నా, షూటింగ్ ఆలస్యం కావడంతో మార్చి రిలీజ్ వైపు చూస్తున్నారు. ప్రభాస్ కు నార్త్ లోనూ తిరుగులేని మార్కెట్ ఉండటంతో ఈ సినిమా బిజినెస్ రేంజ్ కూడా ఊహకందని స్థాయిలో ఉండబోతోంది.
ఒకవేళ ఈ రెండు భారీ చిత్రాలు ఒకే డేట్ కు లేదా వారం రోజుల గ్యాప్ లో వస్తే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారుతుంది. చిరంజీవికి తెలుగు మార్కెట్ లో తిరుగులేని బలం ఉండగా, ప్రభాస్ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో డే వన్ నుంచే భారీ ఓపెనింగ్స్ అత్యవసరం. ఇద్దరికీ పెద్ద సంఖ్యలో సింగిల్ స్క్రీన్లు కావాల్సిందే. మొదటి వీకెండ్ లో షోలు చీలిపోతే భారీ రేట్లకు రైట్స్ కొన్న బయ్యర్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది.
ప్రస్తుతానికి ఫౌజీ, విశ్వంభర రిలీజ్ డేట్లపై అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. మార్చి 5తో పాటు మరికొన్ని తేదీలు పరిశీలనలో ఉన్నాయి. విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్, ఫౌజీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ ను లాక్ చేయడంలో అభిమానుల హైప్ మాత్రమే సరిపోదు. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, సోలో రన్ దక్కేలా ప్లాన్ చేసుకోవడమే నిర్మాణ సంస్థల ముందున్న అసలైన టాస్క్.
