Begin typing your search above and press return to search.

మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ హిట్‌... విశ్వంభ‌ర లెక్క‌లేంటి..?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సంక్రాంతికి వ‌చ్చిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో చిరు ఆల్ టైం సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు.

By:  Garuda Media   |   22 Jan 2026 12:35 PM IST
మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ హిట్‌... విశ్వంభ‌ర లెక్క‌లేంటి..?
X

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర విడుదలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. సంక్రాంతికి వ‌చ్చిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారుతో చిరు ఆల్ టైం సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇప్పుడు విశ్వంభ‌ర వంతు వ‌చ్చేసింది. గత కొంతకాలంగా ఈ సినిమా ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది గొప్ప వార్త. తాజా సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ సినిమాను 2026 వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. వాస్తవానికి ఈ సినిమా 2025 సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.., దే సమయంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల ఉండటంతో వాయిదా పడింది. ఆ తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో నాణ్యత కోసం చిత్ర యూనిట్ మరింత సమయం తీసుకోవాలని భావించింది. దీంతో రిలీజ్ డేట్ ప‌లుమార్లు వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు చివ‌ర‌కు స‌మ్మ‌ర్ రేసులో నిలిచింది.

ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణం భారీ స్థాయిలో ఉన్న గ్రాఫిక్స్ అని దర్శకుడు వశిష్ఠ ప‌లుమార్లు చెప్పారు. నిమాలో సుమారు 4676 విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉన్నాయని, వాటిని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ స్టూడియోలు పని చేస్తున్నాయని తెలిపారు. చిరంజీవి సైతం విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని సూచించడంతో మేకర్స్ పనులను వేగవంతం చేశారు. హాలీవుడ్ స్థాయి అవుట్ పుట్ ఇచ్చేందుకు అవతార్ లాంటి సినిమాల‌కు పనిచేసిన నిపుణుల సహకారం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. రెండో భాగం మొత్తం గ్రాఫిక్స్ తోనే ముడిపడి ఉండటంతో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునేలా ఈ సోషియో ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు.

విశ్వంభర సినిమా కేవలం విజువల్ వండర్ గానే కాకుండా కథా పరంగా కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండబోతోందట‌. చందమామ కథల తరహాలో సాగే ఈ అద్భుత ప్రయాణంలో చిరంజీవి పాత్ర గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుంద‌ని చెపుతున్నారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూయువీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మిశ్రమ స్పందన వచ్చినా, గ్రాఫిక్స్ లో లోపాలను సరిదిద్దిన తర్వాత వచ్చే కొత్త గ్లింప్స్ అభిమానులను మెస్మ‌రైజ్ చేస్తుంద‌న్న ధీమాతో చిత్ర యూనిట్ ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్నాయి. చిరంజీవి తన డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసే క్రమంలో ఉన్నారు. ఈ విజువల్ గ్రాండియర్ ను మే 9వ తేదీన లేదా అదే నెలలో విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు ఈ తరహా ఫాంటసీ సినిమాల‌కు మంచి వసూళ్లు తెచ్చిపెడతాయని నిర్మాతలు భావిస్తున్నారు.