Begin typing your search above and press return to search.

భారీ బడ్జెట్.. భారీ ఆలస్యం.. విశ్వంభరను ఆ సెంటిమెంట్ వెంటాడుతోందా?

ఆ తర్వాత సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడటం కూడా ప్రేక్షకుల్లో అనుమానాలను మరింత పెంచింది. అధికారికంగా పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడం అభిమానుల్లో అసహనాన్ని కూడా పెంచింది.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 Jun 2026 4:00 PM IST
భారీ బడ్జెట్.. భారీ ఆలస్యం.. విశ్వంభరను ఆ సెంటిమెంట్ వెంటాడుతోందా?
X

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో విశ్వంభర ఒకటి. భారీ బడ్జెట్, సోషియో ఫాంటసీ కథాంశం, విస్తృత స్థాయిలో రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అదే అంశాలు ఇప్పుడు సినిమాకు సవాళ్లుగానూ మారినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా రిలీజైన మొద‌టి టీజర్ సినిమాకు ఆశించిన స్థాయిలో మైలేజ్ ఇవ్వలేకపోయింది. విజువల్ ఎఫెక్ట్స్ నాణ్యతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సినిమా ఇమేజ్‌కు దెబ్బ కూడా త‌గిలింది. ఆ తర్వాత సినిమా రిలీజ్ వరుసగా వాయిదా పడటం కూడా ప్రేక్షకుల్లో అనుమానాలను మరింత పెంచింది. అధికారికంగా పెద్దగా అప్‌డేట్స్ లేకపోవడం అభిమానుల్లో అసహనాన్ని కూడా పెంచింది.

ఈ పరిస్థితుల్లో చాలామంది అభిమానులు చిరంజీవి గత సినిమా అంజిని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమా టైమ్ లో కూడా అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ కోసం సినిమా ఎన్నో సంవత్సరాలు ఆలస్యమైంది. టెక్నికల్‌గా ప్రశంసలు అందుకున్నప్పటికీ, అంజి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడు విశ్వంభర విషయంలో కూడా అదే తరహా పరిస్థితి పునరావృతం అవుతుందా? అనే ప్రశ్న సహజంగానే ఎదురవుతోంది.

అయితే ఈ రెండు సినిమాలను పూర్తిగా ఒకే కోణంలో చూడలేమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం, పాన్ ఇండియా మార్కెట్ విస్తరించడం, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు విశ్వంభరకు అనుకూలంగా మారే అవకాశముందని వారు చెబుతున్నారు. అయితే కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మెరుగ్గా ఉండటం మాత్రమే సినిమా స‌క్సెస్ కు సరిపోదని, స్ట్రాంగ్ స్టోరీ, ఎమోష‌న్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్డ్స్ గా ఉంటేనే సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని చెప్తున్నారు.

ఇక ట్రేడ్ వర్గాల దృష్టి ప్రస్తుతం సినిమా ప్రమోషన్ వ్యూహంపైనే ఉంది. ఆల్రెడీ మొద‌టి టీజ‌ర్, వ‌రుస వాయిదాల వ‌ల్ల సినిమాపై ఉన్న బ‌జ్ బాగా త‌గ్గిపోయింది. ఇప్పుడు తిరిగి ఆ స్థాయి బ‌జ్ తీసుకురావాలంటే ప‌వ‌ర్‌ఫుల్ ట్రైలర్, ఆకట్టుకునే సాంగ్స్, రిలీజ్ డేట్ విష‌యంలో క్లారిటీ ఇస్తూ అనౌన్స్‌మెంట్ తప్పనిసరిగా అవసరమని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం విజువల్ ఎఫెక్ట్స్ వ‌ర్క్స్ ఆఖ‌రి దశకు చేరుకున్నాయని, ఇప్ప‌టికే పూర్తైన విజువ‌ల్స్ ను చూసిన మెగాస్టార్ అవుట్‌పుట్ పై సంతృప్తిక‌రంగా ఉన్నార‌ని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రేక్షకుల విశ్వాసాన్ని తిరిగి గెలుచుకోవడం మాత్రం మేకర్స్‌కు అసలైన పరీక్షగా మారింది. మ‌రి విశ్వంభర నిజంగానే మరో అంజి గా నిలుస్తుందా? లేక చిరంజీవి కెరీర్‌లో మరో విజువల్ వండర్‌గా హిస్ట‌రీ క్రియేట్ చేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు సినిమా ఫైనల్ అవుట్‌పుట్, ప్రమోషన్స్ మరియు రిలీజ్ తర్వాత ప్రేక్షకుల తీర్పుపైనే ఆధారపడి ఉంది.