Begin typing your search above and press return to search.

దసరా వార్‌లో మెగాస్టార్ ఎంట్రీ?.. మిగతా సినిమాలకు అలర్ట్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక సిన‌మా విశ్వంభర గురించి మరోసారి ఇండస్ట్రీలో చర్చ జోరందుకుంది. చాలా కాలంగా రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   2 July 2026 4:18 PM IST
దసరా వార్‌లో మెగాస్టార్ ఎంట్రీ?.. మిగతా సినిమాలకు అలర్ట్!
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక సిన‌మా విశ్వంభర గురించి మరోసారి ఇండస్ట్రీలో చర్చ జోరందుకుంది. చాలా కాలంగా రిలీజ్ డేట్ పై క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు త్వరలోనే శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్ర బృందం దసరా సీజన్‌ను టార్గెట్ గా పెట్టుకుని పనులను వేగవంతం చేస్తోందనే టాక్ వినిపిస్తుండటంతో, అక్టోబర్‌లో మెగాస్టార్ సందడి దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దసరా అనేది తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత కీలకమైన సీజన్‌లలో ఒకటి. హాలిడేస్, ఫ్యామిలీ ఆడియ‌న్స్ స‌పోర్ట్, పండుగ వాతావరణం కలిసి పెద్ద సినిమాలకు భారీ ఓపెనింగ్స్ అందించే సీజ‌న్ కావడంతో, ఈ సీజన్‌పై స్టార్ హీరోల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. అలాంటి టైమ్ లో చిరంజీవి సినిమా వస్తే బాక్సాఫీస్ ఈక్వేష‌న్స్ సహజంగానే మారిపోతాయి. ఇప్పటికే అదే సీజన్‌ను పరిశీలిస్తున్న ఇతర సినిమాల రిలీజ్ ప్లాన్స్ పై కూడా దీని ప్రభావం ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా థియేటర్ల కేటాయింపు విషయంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. మెగాస్టార్ సినిమాకు మామూలుగానే పెద్ద ఎత్తున స్క్రీన్లు దక్కే అవకాశముండటంతో, అదే సమయంలో రిలీజ్ కు రెడీ అవుతున్న వేరే సినిమాలు త‌మ రిలీజ్ డేట్స్ ను పునఃసమీక్షించే పరిస్థితి ఏర్పడొచ్చనే చర్చ సాగుతోంది. పండుగ సీజన్‌లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఎంత ముఖ్యమో, సరైన రిలీజ్ ప్లానింగ్ కూడా అంతే కీలకంగా మారనుంది.

మరోవైపు, చాలా నెలలుగా విశ్వంభర అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. సినిమా రిలీజ్ పై క్లారిటీ రాబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇంకా వెలువడకపోయినా, సినిమా చివరి దశ పనులు పూర్తి కావస్తున్నాయని, సినిమా రిలీజ్ కు అక్టోబ‌ర్ 16వ తేదీని ప‌రిశీలిస్తున్నార‌నే సమాచారం ఫ్యాన్స్ లో అంచనాలను మరింత పెంచుతోంది.

ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది. అందుకే రిలీజ్ కాస్త లేటైనా, మంచి క్వాలిటీతో సినిమాను ఆడియ‌న్స్ ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో చిత్ర బృందం ముందుకు సాగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజువల్ అనుభూతికి పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి రాజీ పడకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా రెడీ చేసిన తర్వాతే సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ డిసైడ్ అయిన‌ట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌స్తే ఈ పండుగ సీజన్ బాక్సాఫీస్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.