ఇంకా ఎంత టైం కావాలి విశ్వంభరా?
‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా ‘విశ్వంభర’నే. 2025 సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాను మొదలుపెట్టారు.
By: Garuda Media | 29 Jan 2026 7:00 PM IST‘భోళా శంకర్’ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సినిమా ‘విశ్వంభర’నే. 2025 సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాను మొదలుపెట్టారు. చకచకా షూటింగ్ కూడా పూర్తి చేశారు. మేకింగ్ దశలో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది కూడా. కానీ టీజర్ రిలీజ్ చేశాక అంతా మారిపోయింది. సబ్‌స్టాండర్డ్ విజువల్స్, ఎఫెక్ట్స్ కారణంగా సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. టీం ఆత్మరక్షణలో పడిపోయింది.
దీంతో రిలీజ్ వాయిదా వేసి.. విజువల్ ఎఫెక్ట్స్ మీద మళ్లీ పని చేయడం మొదలు పెట్టింది టీం. ఇలా వీఎఫెక్స్ మీద రీవర్క్ చేయడం మొదలుపెట్టి ఏడాది దాటిపోయింది. చాలా నెలల పాటు అసలు టీం నుంచి ఏ అప్‌డేట్ కూడా లేదు. ఐతే గత ఏడాది అందరిలోనూ అయోమయం నెలకొన్న సమయంలో టీం ఒక స్పష్టతనిచ్చింది.
చిరు తర్వాత మొదలుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్’ చిత్రానికి సైడ్ ఇస్తూ.. తమ సినిమాను 2026 వేసవికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను పక్కన పెట్టి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మీద ఫోకస్ చేశారు. ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్నీ అందుకుంది. ఆ తర్వాత ‘విశ్వంభర’ అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. చెప్పిన ప్రకారమే వేసవిలో సినిమా రిలీజవుతుందని ఆశిస్తుంటే.. ఇప్పుడు మళ్లీ జులై 10 అంటూ కొత్త డేట్ తెరపైకి వచ్చింది.
దీంతో మళ్లీ మాట తప్పడం ఏంటి.. వేసవి లాంటి క్రేజీ సీజన్‌ను ఎందుకు వదిలేస్తున్నారు.. ఇలా మళ్లీ మళ్లీ వాయిదా వేస్తే సినిమాకు హైప్ మరింత తగ్గిపోదా.. ఇప్పటికీ సినిమా మీద టీంకు గురి కుదరలేదా.. వీఎఫెక్స్ మీద మళ్లీ పని చేసినా ఔట్ పుట్ మెరుగుపడలేదా.. అని రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఈసారి మళ్లీ వాయిదా వేయడానికి కారణమేంటో చెప్పడమో.. లేదంటే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఒక మంచి గ్లింప్స్ రిలీజ్ చేసి మళ్లీ కాన్ఫిడెన్స్ నింపడమో చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
