విశ్వంభర మూవీ నుండీ అదిరిపోయే అప్డేట్.. గ్లింప్స్ తోపాటూ రిలీజ్ డేట్ కూడా!
ప్రతి హీరో బర్త్ డేకి ఆ హీరో కొత్త సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది.
By: Madhu Reddy | 21 Aug 2025 11:14 AM ISTప్రతి హీరో బర్త్ డేకి ఆ హీరో కొత్త సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ అయితే ఉంటుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్న చిరంజీవి బర్త్డే అంటే ఇండస్ట్రీలో ఒక సంబరమే.. దేశవ్యాప్తంగా చిరంజీవి బర్త్డే వేడుకలను ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు ఆయన అభిమానులు.. మరి చిరంజీవి బర్త్డేకి ఆయన కొత్త సినిమా నుండి అప్డేట్ రాకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవ్వరూ.. కచ్చితంగా హర్ట్ అవుతారు. అందుకే చిరంజీవి బర్త్డేకి ఒకరోజు ముందుగానే ఆయన కొత్త సినిమా నుండి అప్డేట్ ఇచ్చేసారు. తాజాగా చిరంజీవి తన విశ్వంభర మూవీకి సంబంధించి గుడ్ న్యూస్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. మరి ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..
విశ్వంభరపై చిరంజీవి బిగ్ అప్డేట్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా..త్రిష హీరోయిన్ గా.. బింబిసారా ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ మూవీ విశ్వంభర. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాని ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణ రెడ్డి, విక్రమ్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో విశ్వంభర మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు. ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ.. "చాలా రోజుల నుండి విశ్వంభర లేట్ ఎందుకు అవుతుంది అని ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ విశ్వంభర సినిమా ఆలస్యం అవ్వడానికి ఒకే ఒక్క కారణం. ఈ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ అలాగే గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. ఈ సినిమాని అత్యంత క్వాలిటీతో.. అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశంతో సినీ నిర్మాతలు,దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. అందుకే విశ్వంభర సినిమా లేట్ అవుతోంది.
సాయంత్రం 6 గంటలకు విశ్వంభర నుండి గ్లింప్స్..
ఈ సమయంలో ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సముచిత సమయం ఇది. విశ్వంభర సినిమా గురించి చెప్పాలంటే.. ఇది ఒక చందమామ కథ లాగా సాగిపోయే కథనం. ఈ సినిమా చూస్తున్నంత సేపు చిన్న, పెద్ద ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకోసం, నాకోసం యూవీ క్రియేషన్స్ వాళ్లు మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుండి ఒక చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నారు. మరికొద్ది గంటల్లో అంటే నా పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే ఆగస్టు 21 సాయంత్రం 6:06 గంటలకు విశ్వంభర నుండి గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ గ్లింప్స్ కచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుందని నేను భావిస్తున్నాను.
రిలీజ్ అప్పుడే..
అంతా సరే గ్లింప్స్ బాగానే ఉంటాయి. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పట్లేదని మీరు అనుకోవచ్చు.అయితే రిలీజ్ డేట్ ఎప్పుడో లీక్ చేస్తున్నాను.. పెద్దవాళ్లు, పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే సమ్మర్ లో ఈ సినిమా విడుదల కాబోతోంది.వచ్చే ఏడాది అనగా 2026 సమ్మర్ లో విశ్వంభర మీ ముందుకు వస్తుంది.నాది భరోసా.. ఖచ్చితంగా వచ్చే వేసవిలో ఈ సినిమాని చూడండి.. ఆనందించండి.. విశ్వంభర ని ఆశీర్వదించండి" అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి..
రూమర్స్ కి చెక్ పెట్టిన చిరంజీవి..
అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర మూవీ తిరిగి రీ షూట్ చేస్తున్నారని, వీఎఫ్ఎక్స్ అస్సలు బాగా లేదని,అందుకే సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ప్రేక్షకులను ఏం ఆకట్టుకుంటుంది అంటూ ఎన్నో రూమర్లు, విమర్శలు విశ్వంభర మూవీ మీద వస్తున్నాయి. అయితే ఈ రూమర్లు, విమర్శలు అన్నింటికి చెక్ పెట్టడం కోసమే చిరంజీవి తాజాగా తన విశ్వంభర మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
