ఇండిపెండెన్స్ డే వీకెండ్లో చిరు?
అదే ఔట్‌పుట్‌తో సినిమాను రిలీజ్ చేస్తే చాలా కష్టమని.. విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ అంతా మార్చేయాలని టీం నిర్ణయించింది. దీంతో సినిమా నిరవధికంగా వాయిదా పడింది.
By: Garuda Media | 28 April 2026 8:15 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో మూడేళ్ల ముందు మొదలుపెట్టిన సినిమా ‘విశ్వంభర’. కానీ ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా మొదలైనపుడు అంచనాలు మామూలుగా లేవు. చిరు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా.. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు.. యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్.. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాను గుర్తు చేసే ఫాంటసీ జానర్.. ఇలా సినిమా మొదలైనపుడు ప్రతి విషయం ఎంతో క్యూరియాసిటీ పెంచాయి.
కానీ ఈ సినిమా టీజర్ లాంచ్ అయ్యాక మొత్తం మారిపోయింది. అందులో విజువల్స్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో టీం ఆత్మరక్షణలో పడిపోయింది.
అదే ఔట్‌పుట్‌తో సినిమాను రిలీజ్ చేస్తే చాలా కష్టమని.. విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్ అంతా మార్చేయాలని టీం నిర్ణయించింది. దీంతో సినిమా నిరవధికంగా వాయిదా పడింది. గత సంక్రాంతికి అనుకున్న సినిమా కాస్తా.. రెండోసారి ప్రకటించినట్లు ఈ వేసవికి కూడా విడుదల కావట్లేదు. చివరగా జులై 10 డేట్ తెరపైకి వచ్చింది. ఆ రోజు సినిమా రిలీజ్ ఖాయమని, అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ రోజు కూడా సినిమా రిలీజ్ కాదని అర్థమైపోయింది. చిరు తనయుడు రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’ జూన్ 25కు ఖరారవడంతో ‘విశ్వంభర’ను వాయిదా వేయక తప్పట్లేదు.
చరణ్ సినిమా వచ్చిన రెండు వారాలకే చిరు సినిమాను రిలీజ్ చేసే పరిస్థితి లేకపోవడమే అందుక్కారణం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ‘విశ్వంభర’ కోసం ఇండిపెండెన్స్ డే వీకెండ్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ టైంలో లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది. సినిమా బాగుంటే వసూళ్ల మోత మోగుతుంది. అందుకే ఆ వీకెండ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ సుదీర్ఘ కాలంగా జరుగుతోంది. అది కూడా ఒక కొలిక్కి వచ్చినట్లే భావిస్తున్నారు. ఆగస్టు 13 లేదా 14 తేదీల్లో ఒక డేట్ ఎంచుకుని త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని.. ఇది ఫైనల్ అని.. కచ్చితంగా ఆ డేటుకు సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం.
