చిరు తప్పుకున్నాడా.. పోటీ పడనున్నాడా?
మెగాస్టార్ చిరంజీవి మూడున్నరేళ్ల ముందు మొదలుపెట్టిన చిత్రం.. విశ్వంభర. అప్పుడు ఈ సినిమాకు అనుకున్న రిలీజ్ డేట్ 2024 సంక్రాంతి.
By: Garuda Media | 28 Aug 2026 8:30 AM ISTమెగాస్టార్ చిరంజీవి మూడున్నరేళ్ల ముందు మొదలుపెట్టిన చిత్రం.. విశ్వంభర. అప్పుడు ఈ సినిమాకు అనుకున్న రిలీజ్ డేట్ 2024 సంక్రాంతి. కానీ అది కాకుండా ఇంకో రెండు సంక్రాంతి పండుగలు అయిపోయాయి. ఇంకా సినిమాకు మోక్షం రాలేదు. చివరికి ఈ ఏడాది దసరాకు ‘విశ్వంభర’ను రిలీజ్ చేస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. మెగా అభిమానులు ఆ డేట్ మీదే ఆశలు పెట్టుకుని ఉన్నారు.
కానీ ఈ చిత్రం ఆ సీజన్‌ను కూడా మిస్ కాబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. చిరు సినిమా పోటీలో ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పటిదాకా తెలుగు నుంచి ఏ పెద్ద సినిమా దసరా రేసులోకి రాలేదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ చిత్రం ‘రణబాలి’ దసరా రిలీజ్ డేట్ ఎంచుకుంది. అక్టోబరు 16న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
దసరాకు తమిళం నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘జైలర్-2’ కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ‘జైలర్-2’కు తెలుగులో కూడా బంపర్ క్రేజ్ ఉంది. అది కూడా తెలుగు సినిమా కిందే లెక్క. మరి రెండు క్రేజీ సినిమాాలు పోటీలో ఉండగా.. ‘విశ్వంభర’ కూడా రిలీజయ్యే అవకాశముందా అన్నది ప్రశ్న. అసలే బాగా ఆలస్యం అయిన సినిమా. హైప్ ఒకప్పటి స్థాయిలో లేదు. ఒకరకమైన నెగెటివిటీ ముసురుకున్న సినిమాను ఇంత పోటీ మధ్య రిలీజ్ చేయడం ఒకింత రిస్కే. కానీ ఈ సీజన్ మిస్సయితే.. ఇంకో మంచి రిలీజ్ డేట్ ఎంచుకోవడం సమస్యే.
అంతే కాక సినిమా మరింత ఆలస్యం అయితే అభిమానుల్లో అసహనం పెరిగిపోతుంది. మరి ఈ స్థితిలో ‘విశ్వంభర’ టీం ఏం చేస్తుందన్నది ఆసక్తికరం. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన వశిష్ఠ.. ఈ చిత్రంలో నాలుగేళ్లకు పైగా లాక్ అయిపోయి ఉన్నాడు. యువి క్రియేషన్స్ వాళ్లు కూడా ఈ చిత్రంపై భారీగా బడ్జెట్ పెట్టేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చిరుకేమో ఈ సినిమాను వీలైనంత త్వరగా బయటికి తీసుకురావడం ప్రెస్టీజ్ ఇష్యూగా మారింది. మరి ‘విశ్వంభర’కు మోక్షం లభిస్తుందో చూడాలి.
