విజయ్ డెబ్యూ ముహూర్తానికి వెళ్లాను.. ఇప్పుడు వారసుడు కూడా.. మెగాస్టార్ భావోద్వేగం!
టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడి ఆరంగేట్రం గురించే చర్చ సాగుతోంది.
By: Sivaji Kontham | 26 Sept 2026 10:21 AM ISTటాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడి ఆరంగేట్రం గురించే చర్చ సాగుతోంది. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ తొలి సినిమాతో ఆశించిన మ్యాజిక్ చేస్తాడా? అన్న చర్చ సాగుతోంది. అతడు తెరకెక్కించిన `సిగ్మా` ప్రీరిలీజ్ ఈవెంట్ ఉత్కంఠకు కేంద్రంగా నిలిచింది. సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్-అడ్వెంచర్ హీస్ట్ కామెడీ సిగ్మాపై ప్రీరిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్ర వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేశారు. అంతేకాదు దళపతి విజయ్ డెబ్యూ సినిమా ముహూర్తానికి తాను హాజరయ్యానని, ఇప్పుడు అతడి వారసుడి సినిమా వేడుకకు విచ్చేసానని మెమరీస్ లోకి వెళ్లారు చిరు.
ఈ వేదికపై దళపతి విజయ్ కుటుంబంతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని చిరంజీవి గుర్తుచేసుకున్నారు. విజయ్ తండ్రి, దిగ్గజ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్ తనకు `చట్టానికి కళ్లులేవు`, `దేవాంతకుడు` వంటి అద్భుతమైన చిత్రాలు అందించారని తెలిపారు. విజయ్ తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన కొత్తలో ఆయన డెబ్యూ మూవీ ముహూర్తపు వేడుకకు తాను స్వయంగా వెళ్ళిన విషయాన్ని మెగాస్టార్ ఎంతో ఆప్యాయంగా నెమరువేసుకున్నారు.
కాలం ఎంత వేగంగా మారిందో చెబుతూ... సరిగ్గా అలానే ఒకనాడు విజయ్‌ని చూసినట్లే ఇప్పుడు ఆయన కుమారుడు జేసన్ సంజయ్‌ని చూస్తున్నానని చిరు ఉద్వేగానికి లోనయ్యారు. తాతగారు, నాన్నామ్మల నుంచి వచ్చిన కళా వారసత్వం సంజయ్‌లో స్పష్టంగా కనిపిస్తోందని ప్రశంసించారు. సంజయ్ ముఖాన్ని చూస్తుంటే సరిగ్గా విజయ్ తాలూకు జ్ఞాపకాలే కళ్ల ముందు మెదులుతాయని పేర్కొన్నారు.
అయితే సంజయ్‌ని ఎందుకు హీరోగా ప్రయత్నించలేదని ఎవరైనా అడిగితే.. తనకు నటన కంటే దర్శకత్వం, రచనే ఎంతో ఇష్టమని తను బదులిచ్చాడని చిరు వెల్లడించారు. తన తండ్రి, తాతల బాటలోనే తన ప్యాషన్ అయిన డైరెక్షన్ రంగంలో సంజయ్ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆకాంక్షించారు. ఈ సినిమాతో దర్శకుడిగా ఆయన వేస్తున్న తొలి అడుగు అద్భుతమైన విజయవంతం కావాలని దీవించారు.
అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న `సిగ్మా` చిత్రం ఘనవిజయం సాధించి.. జేసన్ సంజయ్‌కి టాలీవుడ్‌లో సముచితమైన గుర్తింపు తెచ్చిపెట్టాలని చిరంజీవి ఆకాంక్షించారు. పరిశ్రమలోకి కొత్త ప్రతిభావంతులు రావాలని.. అప్పుడే తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
