Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌తో క‌లిసి చేయాల‌ని.. వెంకీ మామ ఎమోష‌న‌ల్

మెగాస్టార్ చిరంజీవి నటించిన `మ‌న శంకర వ‌ర ప్ర‌సాద్ గారు` 2026 సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Satya P   |   4 Dec 2025 8:50 AM IST
మెగాస్టార్‌తో క‌లిసి చేయాల‌ని.. వెంకీ మామ ఎమోష‌న‌ల్
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన `మ‌న శంకర వ‌ర ప్ర‌సాద్ గారు` 2026 సంక్రాంతి బ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విక్టరీ వెంక‌టేష్ అతిథి పాత్ర‌లో న‌టించారు. నయనతార కథానాయిక. నేటితో వెంకటేష్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. హైదరాబాద్ లోని ఒక పబ్ లో చిత్రీకరించిన ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ షూటింగ్ ను వెంకీ- చిరు పూర్తి చేశారు. ఈ స్పెష‌ల్ పాట ప్రేక్షకులకు ప‌సందైన‌ విందును అందించ‌బోతోంద‌ని నిర్మాత‌లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ తో తన వ‌ర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ని వెంకీ షేర్ చేసారు.

వెంకీ మాట్లాడుతూ-``మన శంకర వర ప్రసాద్ గారి కోసం నేను ఈ చిత్రంలో న‌టించాను. అది ఎంత అద్భుతమైన అనుభవం! నాకు అత్యంత ఇష్టమైన చిరంజీవితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకు చాలా అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ ని షేర్ చేసుకోవాల‌ని చాలా కాలంగా వేచి చూస్తున్నాను... ఇప్ప‌టికి వీలు ప‌డినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అనిల్ రావిపూడి చివరకు ఈ ప్రత్యేక చిత్రం కోసం మమ్మల్ని ఒకచోట చేర్చారు. మీ అందరితో కలిసి 2026 సంక్రాంతిని థియేటర్లలో సెల‌బ్రేట్ చేసుకోవడానికి వేచి ఉండలేను!`` అని వెంకీ తన ట్వీట్‌లో రాశారు.

త‌న రాక‌తో వెంకీ ఈ సినిమాని ప్ర‌త్యేకంగా మార్చార‌ని చిరు కితాబిచ్చారు. ``మేం కలిసి పనిచేసిన ఆ అద్భుతమైన పది రోజులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ చేరిక‌ చాలా ఆనందం, శక్తిని తెచ్చిపెట్టింది. మీతో క‌లిసి ప్రతి క్షణాన్ని ఆస్వాధించాను. చాలా ఆనందంగా ఉంది`` అని చిరు వ్యాఖ్యానించారు.

దిగ్గజ నటులను ఒకచోట చేర్చ‌డంతో త‌న చిన్న నాటి క‌ల నిజ‌మైంద‌ని అనీల్ రావిపూడి అన్నారు. కొన్ని కలలు హృదయంలో చాలా సంవత్సరాలు నిలిచి ఉంటాయి... ఆపై ఒక రోజు ఇలాంటి క్షణం వ‌స్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంక‌టేష్ గారు కలిసి నిలబడటం, కలిసి నృత్యం చేయడం, నవ్వడం, వారి సిగ్నేచ‌ర్ స్టైల్ తో ఆకర్షణను పెంచ‌డం ఇవ‌న్నీ ఎగ్జ‌యిట్ చేసాయి.. నేను దీనిని మాటల్లో వర్ణించలేను! అని రాశారు.

ఇది నా కెరీర్ ప్రయాణంలో లభించిన గొప్ప గౌరవాలలో ఒకటి. దీన్ని సాధ్యం చేస్తూ, మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారి కోసం కోసం ఈ పాత్రను చేసినందుకు నా ప్రియమైన వెంకీ సర్‌కు వినయపూర్వ‌క‌ కృతజ్ఞతలు.. అని అనీల్ రావిపూడి ఎమోష‌న‌ల్ అయ్యారు.

షైన్ స్క్రీన్స్- గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సాహు గారపాటి- సుష్మితా కొణిదెల నిర్మించారు. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా ఒక‌ కీలక పాత్రలో నటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. పాట‌ల‌కు అద్భుత స్పంద‌న వ‌స్తోంది.