Begin typing your search above and press return to search.

టికెట్ & ఫుడ్ ధరలు.. చిరంజీవి కీలక నిర్ణయం!

అందుకే చిరంజీవి ఆ అంశంపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   6 Jan 2026 10:09 PM IST
టికెట్ & ఫుడ్ ధరలు.. చిరంజీవి కీలక నిర్ణయం!
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక సమస్యపై చొరవ తీసుకోనున్నారు. థియేటర్లలో టికెట్ ధరలు, ఆహార పదార్ధాల ధరలపై నెలకొన్న వివాదాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆ అంశాన్ని సీరియస్‌ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి.. సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపనున్నట్లు నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవితో ఆయన మన శంకర వరప్రసాద్ గారు మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఆ సినిమా జనవరి 14వ తేదీన విడుదల అవ్వనుంది.

దీంతో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాహు గారపాటి, థియేటర్లలో అమలవుతున్న అధిక టికెట్ ధరలు, పాప్‌ కార్న్, కూల్‌ డ్రింక్స్ వంటి ఫుడ్ ఐటమ్స్ ధరల విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఆ సమస్యలు సాధారణ ప్రేక్షకులపై చాలా భారం అవుతున్నాయని చిరంజీవి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి పండుగ సీజన్ పూర్తయిన వెంటనే చిరంజీవి ప్రభుత్వాలతో భేటీ అవుతారని సాహు గారపాటి స్పష్టం చేశారు.

సినీ పరిశ్రమకు, ప్రేక్షకులకు ఇద్దరికీ న్యాయం జరిగేలా పరిష్కారం కనుగొనడమే చిరంజీవి లక్ష్యమని ఆయన అన్నారు! ఇటీవల కాలంలో థియేటర్లలో ఫుడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో పాప్‌ కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు సామాన్య ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తున్నాయనే చెప్పాలి. అలాగే కొన్ని సినిమాలకు టికెట్ ధరలు కూడా భారీగా పెరగడం వల్ల కుటుంబ సమేతంగా థియేటర్స్ లో చూడడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోందనే కొన్నాళ్లుగా అంతా అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందుకే చిరంజీవి ఆ అంశంపై ఫోకస్ పెట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలపై చిరంజీవి చొరవ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ఆయన చొరవ తీసుకునేందుకు సిద్ధమవ్వడం పట్ల అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో మెగాస్టార్ చేపట్టనున్న చర్చల్లో థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని, సరైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఇప్పుడు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా టికెట్ ధరలు, ఫుడ్ రేట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు కచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.