MSG బ్లాక్ బస్టర్ హిట్..మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!
బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కుని దాటిన ఈ మూవీ ఇప్పటి వరకు చిరు నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది.
By: Tupaki Entertainment Desk | 20 Jan 2026 6:13 PM ISTగత ఏడాది సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా వెంకీ మామ ఖాతాలోనూ రూ.200 కోట్ల మార్కు బ్లాక్ బస్టర్‌ని అందించి ప్రముఖుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నాడు హిట్ మెషీన్ అనిల్ రావిపూడి. అలాంటి క్రేజీ డైరెక్టర్‌తో తొలిసారి చేతులు కలపిన మెగాస్టార్ చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌గారు` మూవీతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చారు. వాల్తేరు వీరయ్యకు ముందు ఆ తరువాత వరుసగా భారీ డిజాస్టర్లని ఎదుర్కొన్న చిరు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్‌ని దక్కించుకోవడం తెలిసిందే.
ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు అనిల్ మార్కు కామెడీ అంశాలని జోడించి తెరకెక్కిన ఈ సినిమాతో చాలా కాలంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వింటేజ్ చిరుని పరిచయం చేయడం, ఆయన మార్కు టైమింగ్ తో పంచ్‌లు వేయించడంతో సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద సృష్టిస్తోంది. విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌ని సొంతం చేసుకున్న `మన శంకరవరప్రసాద్‌గారు` విడుదలైన పది రోజుల్లోనే పలు రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్కుని దాటిన ఈ మూవీ ఇప్పటి వరకు చిరు నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లని రాబట్టిన మూవీగా నిలిచింది. ఈ స్థాయి వసూళ్లని రాబట్టిన సినిమాగా చిరు కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డు సాధించిన హిట్ మూవీ అనిపించుకుంది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంక్రాంతి విజేతగా నిలవడంతో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అనూహ్య విజయానికి ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చిరు షేర్ చేసిన పోస్ట్ ఆకట్టుకుంటోంది.
`మన శంకరవరప్రసాద్ గారు` సినిమాకు ప్రేక్షకదేవుళ్లు చూపిస్తున్న ఆదరణ, మరియు ఆపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడి ఉంది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది.
ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరిది. వెండితెరమీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి..పోతుంటాయి. కానీ మీరు నాపై చూపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషీన్ అనిల్‌రావిపూడికి, నిర్మాతలు సాహు, సుష్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ..నాపై మీరు చూపించిన అంచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని ఇలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో లవ్ యూ ఆల్` అంటూ మెగాస్టార్ తన ఆనందాన్ని పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
