హైదరాబాద్ గ్లోబల్ సినీ హబ్ .. రేవంత్ విజన్‌పై మెగాస్టార్ ప్రశంస
సీఎం రేవంత్ రెడ్డికి సినీపరిశ్రమపై ఉన్న గౌరవం కారణంగానే నేను ఈ వేదికకు రాగలిగాను. పరిశ్రమ తరపున రిప్రజెంటేటివ్ గా మాత్రమే నేను ఇక్కడకు వచ్చాను.
By: Sivaji Kontham | 9 Dec 2025 10:22 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఈరోజు (9 డిసెంబర్ 2025) తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అనంతరం చిరు సీఎం రేవంత్ రెడ్డి విజన్ ని ప్రశంసించారు. వినోద రంగం సహా అన్ని రంగాల విజన్ ని ఒకే వేదికగా రేవంత్ సఫలీకృతం చేసుకున్న తీరుపై ప్రశంసల వర్షం కురిపించారు.
హైదరాబాద్ లో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ పెట్టుబడులు పెడుతున్నారు అంటే దానికి రేవంత్ విజన్ కూడా ఒక కారణమని ప్రశంసించడం విశేషం. హైదరాబాద్ ని వరల్డ్ సినీ హబ్ గా మార్చేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కూడా మెగాస్టార్ అన్నారు. సల్మాన్, అజయ్ దేవగన్ లాంటి స్టార్లు అడ్వాన్స్ డ్ ఫ్యూచరిస్టిక్ స్టూడియోలు పెడతామని ఇక్కడికి వచ్చారు అంటే దానికి ప్రభుత్వ సహకారం కారణం... దానికి సినీపరిశ్రమ తరపున మేమంతా సహకరిస్తామని చిరు అన్నారు.
ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా, ముఖ్యంగా వినోద రంగం విషయంలో తన వంతు కృషి చేస్తానని వ్యాఖ్యానించిన చిరు సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మంచి అవకాశాలను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి సినీపరిశ్రమపై ఉన్న గౌరవం కారణంగానే నేను ఈ వేదికకు రాగలిగాను. పరిశ్రమ తరపున రిప్రజెంటేటివ్ గా మాత్రమే నేను ఇక్కడకు వచ్చాను. రేవంత్ ముఖ్యమంత్రి అవ్వగానే నేను కలిసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. హైదరాబాద్ ని గ్లోబల్ ఫిల్మ్ హబ్ గా మార్చాలని నాతో అన్నారు. కేవలం తెలుగు వరకే కాదు, ప్రపంచ భాషలకు విస్తరించాలి. అన్ని భాషల సినిమాల షూటింగులు ఇక్కడ జరగాలి. అన్ని సినీరంగాలకు మనం వేదికగా మారాలని మీరు ధైర్యంగా అన్నప్పుడు నిజంగా ఇది సాధ్యమైతే బావుంటుందని అనుకున్నాను. గత ప్రభుత్వాలు పూర్తిగా సహకరించలేదు. కానీ మీరు ఈ డ్రీమ్ ని సక్సెస్ చేయగలరా? అని అనుకున్నాను. మీరు ప్రణాళికను సిద్ధం చేస్తే సహకారం అందిస్తామని మాత్రమే నేను అన్నాను. అయితే ఇప్పుడు ఒక గ్లోబల్ వేదికను ఏర్పాటు చేసి తాను అన్నదానిని ప్రాక్టికల్ గా సాధ్యం చేయడానికి సీఎం రేవంత్ ముందడుగు వేసారు. ఇది చాలు, ఆయన అన్నది సాధిస్తారని నమ్మకం కుదిరింది. హైదరాబాద్ దేశంలోని అన్నిటికీ కేంద్ర స్థానంలో ఉన్న నగరం. ఇక్కడి నుంచి అన్ని పెద్ద నగరాలకు సులవుగా ప్రయాణించగలం. అన్నిరకాలా స్కిల్ ఇక్కడ ఉంది. సినీరంగానికి అవసరమైన అన్ని వనరులు ఇక్కడ ఉన్నాయి. మా సినీపెద్దల నడుమ కొంత చర్చ జరిగింది. మీరు చేసే ఈ యజ్ఞానికి సహకరించేందుకు మేం ముందుకు వస్తాం.. అన్నివిధాలా సహకరిస్తాం... అని చిరు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా `వేవ్స్` అనే వేదికను క్రియేట్ చేసి వినోద రంగం నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానించారని చిరంజీవి ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. సినీపరిశ్రమ ఎందరికో ఉపాధినిస్తోంది. చాలా రెవెన్యూని కంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే దీనిని పరిశ్రమగా గుర్తించి కేంద్రం గౌరవించింది. తెలంగాణ మంత్రి బట్టి విక్రమార్క కూడా ఇక్కడ ఎలాంటి వనరులు కావాలి? అని ప్రశ్నించారు. అయితే మేం స్కిల్ డెవలప్ మెంట్ కోసం ఒక ఇనిస్టిట్యూట్ కావాలి అని చెబుతున్నాను. సినీరంగంలో నటన సహా 24 శాఖలకు సంబంధించి శిక్షణ ఇచ్చే సంస్థను నెలకొల్పాలి అని చిరంజీవి ఈ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
