Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ రావాలి.. CM విజ‌య్ సుపుత్రుడికి మెగాస్టార్ బ్లెస్సింగ్స్!

టాలీవుడ్‌లో కొత్త ప్రతిభను, యువ దర్శకులను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు.

By:  Sivaji Kontham   |   25 Sept 2026 10:24 PM IST
ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ రావాలి.. CM విజ‌య్ సుపుత్రుడికి మెగాస్టార్ బ్లెస్సింగ్స్!
X

టాలీవుడ్‌లో కొత్త ప్రతిభను, యువ దర్శకులను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన `సిగ్మా` (SIGMA) ప్రీ-రిలీజ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో ఎంతో ఆసక్తికరంగా మారింది. ఉదయం నుంచి షూటింగ్‌తో ఎంతో బిజీగా ఉన్నా యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడమే తన ప్రధాన బాధ్యతగా భావించి ఈ వేడుకకు హాజరైనట్లు చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు జేసన్ సంజయ్ , నటుడు సందీప్ కిషన్ మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో తాను ఈ కార్యక్రమానికి వచ్చానని స్పష్టం చేశారు.

ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న జేసన్ సంజయ్ నేపథ్యాన్ని మెగాస్టార్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. జేసన్ సంజయ్ తాతగారైన ప్రముఖ దిగ్గజ దర్శకులు ఎస్.ఏ. చంద్రశేఖర్ గతంలో తనకు `చట్టానికి కళ్ళు లేవు`,`దేవాంతకుడు` వంటి అద్భుతమైన బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చారని కొనియాడారు. అలాంటి గొప్ప సినీ కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాడు డైరెక్షన్ వైపు అడుగులు వేయడం ఎంతో సంతోషకరమని.. తాతగారి పోలికలు, లక్షణాలు అతడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని చిరు ప్రశంసించారు.

ఇక సినిమా టైటిల్ -కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ.. `సిగ్మా`' అంటే ఎవరి మాట వినకుండా.. తనకు తోచినట్లుగా.. తాను నమ్మిన పద్ధతిలో స్వతంత్రంగా ముందుకు వెళ్లే ఒక యూనిక్ క్యారెక్టరిజం అని మెగాస్టార్ వివరించారు. ఈ టైటిల్ ఆలోచనే చాలా కొత్తగా ఉందని మెచ్చుకున్న చిరు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా అత్యంత ఎంటర్‌టైనింగ్‌గా.. పూర్తి జోష్‌తో ఉత్సాహంగా సాగుతుందని కితాబిచ్చారు. సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా ఆయన మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఒకేరీతిలో ఉండకూడదని.. ఇండస్ట్రీలోకి కొత్త బ్లడ్ (యంగ్ టాలెంట్) వస్తేనే పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతుందని చిరంజీవి గట్టిగా ఉద్ఘాటించారు. ఈ ఏడాది (2026) ద్వితీయార్థంలో ఏ సినిమా చిన్నదైనా, పెద్దదైనా కంటెంట్ బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అద్భుతంగా ఆదరిస్తున్నారని..అలాగే `సిగ్మా` సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. సందీప్ కిషన్ తన ప్రతి చిత్రంలోనూ డిఫరెంట్ కంటెంట్‌తో ప్రెజెంట్ చేసుకోవడం విశేషమన్నారు.

చివరగా ఇదే వేదికపై తమ్మన్, ఫరియా అబ్దుల్లా తదితరులతో తన పాత జ్ఞాపకాలను- అనుభవాలను పంచుకుంటూ చిరంజీవి నవ్వులు పూయించారు. అక్టోబర్ 2న అట్టహాసంగా విడుదలవుతున్న `సిగ్మా` సినిమా ఘన విజయం సాధించి చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ స్వయంగా అందించిన ఈ బ్లెస్సింగ్స్‌తో `సిగ్మా` టీమ్ ఫుల్ జోష్‌లో ఉండగా.., మెగాభిమానుల దీవెనలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి!