అన్నదమ్ముల్లాంటి మెగాస్టార్లు ఇద్దరికీ ఇదేం ఇబ్బందో!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది.
By: Srikanth Kontham | 24 Jun 2026 1:35 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి- బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఇద్దరు సమకాలీన స్టార్ హీరోలు మాత్రమే కాదు. తెర వెనుక కూడా ఎంతో ఆత్మీయంగా అన్న దమ్ముల్లా మెలుగుతుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ ఇండస్ట్రీకి ఆదర్శంగా నిలిస్తుంటారు. అయితే ఈ మెగాస్టార్లకి ఇద్దరికీ ఒకే రకమైన ఇబ్బంది ఎదురవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రాల విడుదల విషయంలో ఇరువురు భిన్నమైన సమస్యలతో నిరీక్షణ చేయాల్సి రావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
చిరంజీవి విషయానికి వస్తే ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర`పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కంటే ఆలస్యంగా ప్రారంభమైన చిరు మరో ప్రాజెక్ట్ `మన శంకర వరప్రసాద్ గారు` ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదలైపోయింది. కానీ `విశ్వంభర` మాత్రం ఇంకా థియేటర్లలోకి రాకపోవడం మెగా అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది.
`విశ్వంభర` ఆలస్యానికి ప్రధాన కారణం అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ , గ్రాఫిక్స్ పనులేనని తెలుస్తోంది. ఫాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండే ఇలాంటి చిత్రాలకు అవుట్‌పుట్ పక్కాగా రావడం ఎంతో ముఖ్యం. ఎక్కడో ఒకచోట రాజీపడి సినిమాను హడావుడిగా రిలీజ్ చేయడం కంటే ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్ అందించాలనే ఉద్దేశంతో చిరంజీవి - నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తుది మెరుగులపై గట్టిగా కసరత్తు చేస్తున్నారు. ఈ పర్ఫెక్ట్ అవుట్‌పుట్ కోసమే సినిమా విడుదల తేదీ నిరంతరం వాయిదా పడుతూ వస్తోంది.
అలాగే బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా లేదు. ఆయన హోమ్ బ్యానర్‌లో అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ వార్ డ్రామా `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` కూడా విడుదలకు ముందు అడ్డంకులను ఎదుర్కొంటోంది. 2020లో జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ నటిస్తున్న చిత్రంపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. మొదట `బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్` అనే టైటిల్‌తో అనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను, కథలోని భావోద్వేగ తీవ్రతను బట్టి `మాతృ భూమిగా మార్చారు.
ఈ చిత్రం అనుకున్న సమయానికి రాకపోవడానికి రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. సృజనాత్మక మార్పులు రీషూట్లే ప్రధాన కారణం. సినిమా కథనంలో మరింత ఇంపాక్ట్ తీసుకురావడం కోసం మేకర్స్ అదనపు షెడ్యూల్స్ వేసి కీలకమైన సన్నివేశాలను తిరిగి చిత్రీకరించారు. అలాగే దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలు ఉండటం..చైనాతో భారత్ స్నేహం కొనసాగించడం వంటి సన్నివేశాలు రిలీజ్ అడ్డంకిగా మారాయి. సినిమాకు సెన్సార్ అవ్వడంలో జాప్యం జరుగతోంది. సెన్సార్ తో పాటు కేంద్రంలోని కొందరు పెద్దలు కూడా చూసిన తర్వాతే సినిమా రిలీజ్ అవుతుంది.
చివరిగా చిరంజీవి- సల్మాన్ ఖాన్ లాంటి భారీ స్టార్డమ్ ఉన్న హీరోల చిత్రాలు ఆలస్యమవడం బిజినెస్ పరంగా, అభిమానుల పరంగా కొంత నిరాశ కలిగించే విషయమే. అయినా నాణ్యత లేని కంటెంట్ కంటే లేట్‌గానైనా లేటె స్ట్‌గా రావడం శ్రేయస్కరం. సమస్యలు వేర్వేరైనా? ఇద్దరు స్టార్స్ కూడా తమ సినిమాల అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. మరి ఈ ఆలస్యం రేపటి భారీ విజయానికి కారణం అవ్వాలని అభిమానులు ఆశీస్తున్నారు.
