Begin typing your search above and press return to search.

వీడియో: వేదిక‌పై చిరు-చ‌ర‌ణ్ రేర్ ఫ‌న్నీ మూవ్‌మెంట్

ఒకే వేదిక‌.. ఒకే ఫ్రేమ్‌.. అక్క‌డ ఒక అరుదైన దృశ్యం.. తండ్రి కొడుకుల మ‌ధ్య ఫ‌న్నీ క్ష‌ణం.. నిజంగా అది వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకుంది.

By:  Sivaji Kontham   |   24 Jun 2026 9:59 AM IST
వీడియో: వేదిక‌పై చిరు-చ‌ర‌ణ్ రేర్ ఫ‌న్నీ మూవ్‌మెంట్
X

ఒకే వేదిక‌.. ఒకే ఫ్రేమ్‌.. అక్క‌డ ఒక అరుదైన దృశ్యం.. తండ్రి కొడుకుల మ‌ధ్య ఫ‌న్నీ క్ష‌ణం.. నిజంగా అది వేలాదిగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకుంది. అందుకు వేదిక అయింది `పెద్ది` స‌క్సెస్ మీట్. ఈ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి స్పీచ్ స్ఫూర్తివంత‌మైన‌ది. బిడ్డ ఎదుగుతున్నాడు.. ఎదిగే బిడ్డ‌ను ఎప్పుడూ ముందుంచాలి. నేను చ‌ర‌ణ్ ని ముందుంచి తెర‌వెన‌క నేను ఉంటాను! అంటూ చిరు ఎంతో స‌ర‌దాగా మాట్లాడారు. ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ ఎంతో ఉల్లాసంగా మెలిక‌లు తిరుగుతూ న‌వ్వేస్తూ జోవియ‌ల్ గా క‌నిపించారు. ప్ర‌స్తుతం ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన క్లిప్ ఇంట‌ర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన `పెద్ది` ఘనవిజయం నేపథ్యంలో వేదికపై ఆయన తన కుమారుడి ఎదుగుదలను చూసి పుత్రోత్సాహాన్ని నూటికి నూరు శాతం ఫీలవుతున్నానని చిరు ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు. ఇటీవల రామ్ చరణ్‌కు లభించిన `న్యూ-ఏజ్ మెగాస్టార్` టైటిల్‌ను ప్రస్తావిస్తూ..``తాను చరణ్‌ను ముందుకు తోసి, నేను వెనక ఉండి నడిపిస్తాను`` అంటూ ఒక తండ్రిగా కొడుకుపై ఉన్న నమ్మకాన్ని, ప్రేమ‌ను చిరంజీవి చాటుకున్నారు.

ఈ సందర్భంగా తమ కుటుంబం సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కష్టాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ``మేము ఏదీ షార్ట్‌కట్ రూపంలో కావాలని అనుకోము.. కేవలం ఒళ్లు వంచి పని చేయడం మాత్రమే మాకు తెలుసు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతాం తప్ప, సోంబేరితనం చూపిస్తూ పనులను పోస్ట్‌పోన్ చేయడం మా డిక్షనరీలోనే లేదు. వేకువజామున 4 గంటలకే నిద్ర లేచి, అల్యూమినియం ఫ్యాక్టరీ లాంటి కఠినమైన లొకేషన్లలో సైతం షూటింగ్‌ల కోసం కష్టపడతాం`` అని మెగాస్టార్ స్పష్టం చేశారు.

సినిమా కోసం రామ్ చరణ్ పడే శ్రమను, ఆయన డెడికేషన్‌ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. `పెద్ది` సినిమా షూటింగ్ సమయంలో చరణ్ కంటికి దెబ్బ తగిలిందని, ఒంటిపై ఫ్రాక్చర్ కూడా అయిందని చెబుతూ చిరంజీవి కాస్త ఎమోషనల్ అయ్యారు. అంత పెద్ద గాయమైనా.. నొప్పిని భరిస్తూ సినిమా కోసం చరణ్ చూపించిన నిబద్ధతను చూసి ఒక తండ్రిగా, ఒక నటుడిగా తనకు ఎంతో గర్వంగా అనిపించిందని అన్నారు. ఆ రోజుల్లో తాను శ్ర‌మిస్తున్న‌ప్పుడు దెబ్బ‌లు త‌గిలించుకున్న‌ప్పుడు మా నాన్న ఏమ‌నేవారో అంటూ నాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నారు చిరు.

ఇక తన ఫిట్‌నెస్ రహస్యాన్ని, చరణ్‌తో ఉన్న బాండింగ్‌ను చిరంజీవి సరదాగా వేదిక‌పై అభిమానుల‌కు షేర్ చేసారు. నేను ఇప్పటికీ జిమ్‌లో చరణ్‌తో పోటీపడతాను. రోజూ రెండు పూటలా జిమ్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఒకవేళ కుదరకపోతే కనీసం ఒక పూట అయినా సరే తప్పకుండా జిమ్ వర్కౌట్స్ పూర్తి చేస్తాను.. అని చెబుతూ తనలోని ఎనర్జీకి గల కారణాన్ని వివరించారు. ఈ వయసులోనూ చిరంజీవి చూపిస్తున్న ఈ క్రమశిక్షణ వేదికపై ఉన్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

చివరగా.. తెలుగు ప్రేక్షకులు తమ కుటుంబంపై చూపిస్తున్న అనంతమైన ఆదరాభిమానాలకు చిరంజీవి శిరస్సు వంచి నమస్కరించారు. చరణ్ తన లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడని.. తండ్రిగా తనకు ఇంతకంటే కావలసింది ఏమీ లేదని భావోద్వేగంతో ముగించారు. మెగాస్టార్ నోటి వెంబడి వచ్చిన ఈ స్ఫూర్తిదాయకమైన మాటలు అటు అభిమానుల్లోనూ, ఇటు చిత్ర పరిశ్రమలోనూ సరికొత్త జోష్ నింపాయి.