Begin typing your search above and press return to search.

చిరంజీవిని మించి న‌టించాడని ఒప్పుకుంటున్నాను!

కుస్తీ (రెజలింగ్) యోధుడిగా కనిపించడం కోసం చరణ్ తెల్లవారుజామున 5 గంటలకే లేచి జిమ్ చేయడం, రోజంతా షూటింగ్‌లో పాల్గొని రాత్రి అలిసిపోయి వచ్చినా మళ్లీ వర్కవుట్స్ చేయడం చూశానన్నారు.

By:  Sivaji Kontham   |   14 Jun 2026 1:37 AM IST
చిరంజీవిని మించి న‌టించాడని ఒప్పుకుంటున్నాను!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం `పెద్ది` బాక్సాఫీస్ వద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఈ క్రమంలోనే సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి చిత్ర బృందంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. రామ్ చరణ్ ఈ సినిమాలో నటించలేదని, ఆ పాత్రలో పూర్తిగా జీవించేశాడని చిరంజీవి కొనియాడారు. చరణ్ స్క్రీన్ మీద తను ఏడవకుండా.. కేవలం కళ్ళలోని భావం ప‌లుకుతూ ఉంటే.. చూసే ప్రేక్షకుడి గుండెను పిండేసి ఏడిపించాడని.. అదే అతని నటనలోని పరిణతికి నిదర్శనమని అభినందించారు. పెద్ది ఎక్క‌డా ఏడ్వ‌కుండా పెద్దిగా మారిపోయి అంద‌రినీ ఏడిపించాడు. లోప‌ల నుంచి ఫీల్ ని క‌లిగించ‌డంలో చ‌ర‌ణ్ న‌ట‌న అద్భుతం. ఒక తండ్రిగా, తోటి సమకాలీన నటుడిగా చరణ్‌ను చూసి తాను ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు.

ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ వినోదాత్మక చిత్రం కాదని.. సమాజంలోని వెనుకబడిన వర్గాల బాధలను.. వారి పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన ఒక అద్భుతమైన జీవిత జర్నీ అని చిరంజీవి అభివర్ణించారు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఆలోచనల నుంచి వచ్చిన ఈ కథాంశం ఎంతో నిజాయితీతో కూడుకున్నదని.. రాత్రి నిద్రలో కూడా ఆ విజువల్స్ తనను వెంటాడేలా తీవ్రమైన ఇంపాక్ట్ చూపించాయని అన్నారు. ఒక చిన్న ఊరి సమస్యగా మొదలైన ఈ కథ.. క్రమంగా భారతదేశంలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల బాధ్యతను గుర్తుచేసేలా ఒక నేషనల్ అండ్ యూనివర్సల్ పాయింట్‌ను తాకిందని అభినందించారు. 1989 నాటి రూరల్ నేపథ్యంలో సాగే ఈ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా సమాజంలో విద్యా వ్యవస్థలో మంచి ఆలోచనను రేకెత్తిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ పాత్ర కోసం రామ్ చరణ్ పడ్డ కఠిన శ్రమను చిరంజీవి ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. కుస్తీ (రెజలింగ్) యోధుడిగా కనిపించడం కోసం చరణ్ తెల్లవారుజామున 5 గంటలకే లేచి జిమ్ చేయడం, రోజంతా షూటింగ్‌లో పాల్గొని రాత్రి అలిసిపోయి వచ్చినా మళ్లీ వర్కవుట్స్ చేయడం చూశానన్నారు. 70 రోజుల పాటు కేవలం వెజిటేరియన్ డైట్ పాటిస్తూ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ చేశాడని వెల్లడించారు. వాడు దెబ్బలు తగిలించుకుని నీరసంగా ఇంటికి వచ్చినప్పుడు పూర్వం తాను దొంగ, గూండా వంటి సినిమాల్లో ప్రాణాలకు తెగించి రిస్క్ షాట్స్ చేసినప్పుడు తన తండ్రి పడ్డ బాధ, కోపపు తిట్లు గుర్తొచ్చాయని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా సినిమాలోని హాస్పిటల్ సీన్లు తలుచుకుంటే ఇప్పటికీ తనకు గూస్ బంప్స్ వస్తున్నాయని.. ఆ సన్నివేశంలో చరణ్ నటన నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉందన్నారు.

ఈ చిత్రం ద్వారా కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరుగుతూ ప్లే గ్రౌండ్స్ లేకుండా చేస్తున్న నేటి కార్పొరేట్ విద్యా వ్యవస్థపై దర్శకుడు గట్టి కొర‌డా విసిరాడని చిరు అన్నారు. పిల్లలకు ఆటలు, శారీరక శ్రమ ఎంత అవసరమో ఈ చిత్రం ఇన్‌స్పైర్ చేస్తుందన్నారు. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడంలో ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రధాన పిల్లర్‌గా నిలిచిందని కొనియాడారు. రెహ్మాన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో ఫీల్ ని ఆవిష్కరించారన్నారు. డిఓపి రత్నవేలు విజువల్స్ మట్టి కథకు కావలసిన రఫ్ నెస్‌ను తేవడంలో, ఎడిటర్ నవీన్ నూలి నరేషన్ కటింగ్‌తో సినిమాను గ్రిప్పింగ్‌గా మార్చడంలో, జగపతి బాబు (అప్పలసూరి), శివరాజ్ కుమార్ వంటి నటులు తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోవడంలో పూర్తి గా సింక్ కుదిరిందని ప్రశంసించారు.

ఇండస్ట్రీలో కొందరు చిరంజీవిని మించి చరణ్ నటించాడని అంటున్నారని, ఒక తండ్రిగా ఆ మాటను తాను మనస్ఫూర్తిగా.. ఎంతో గర్వంగా ఒప్పుకుంటున్నానని మెగాస్టార్ ప్రకటించారు. చివరగా దర్శకుడు బుచ్చిబాబు గురువైన సుకుమార్‌ను గుర్తుచేసుకుంటూ.. గ్రామీణ నేపథ్యంలో ఇంతటి బలమైన కథను రాసేలా బుచ్చిబాబును ఇన్‌స్పైర్ చేసి.. తెలుగు ఇండస్ట్రీకి ఒక మాణిక్యం లాంటి డైరెక్టర్‌ను అందించినందుకు సుకుమార్‌కు చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.