నయనతారను అనీల్ రావిపూడి ఏం చేసాడో కానీ..!
అయితే ఒక సాధారణ ప్రేక్షకుడి ఆలోచనల ప్రకారం.. వేదికపై పెద్ద స్టార్లు ఉన్నా కథానాయిక నయనతార కనిపించలేదేమిటీ ? అనే సందేహం ఉంటుంది.
By: Sivaji Kontham | 7 Jan 2026 11:26 PM ISTతన సినిమాలకు ప్రచారం చేయడానికి ససేమిరా అంటుంది నయనతార. కొన్నేళ్లుగా అలానే ఉంది. అగ్ర హీరోల సినిమాలకు కూడా నిర్మొహమాటంగా డుమ్మా కొడుతుంది. తాను ఒక సినిమాకి అంగీకరించే ముందే ఒప్పందంలోనే ఈ విషయాలను మొహమాటం లేకుండా చెప్పేస్తుందనే ప్రచారం కూడా ఉంది. అందుకే నయన్ ప్రచార కార్యక్రమాలకు రాదు! అని విమర్శించే హక్కు ఎవరికీ లేదు.
అయితే ఒక సాధారణ ప్రేక్షకుడి ఆలోచనల ప్రకారం.. వేదికపై పెద్ద స్టార్లు ఉన్నా కథానాయిక నయనతార కనిపించలేదేమిటీ ? అనే సందేహం ఉంటుంది. గతంలో చాలామంది అగ్ర హీరోల సరసన నటించిన నయనతార నిర్మొహమాటంగా వాటి ప్రచారానికి డుమ్మా కొట్టింది. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా `మన శంకరవరప్రసాద్ గారు` సినిమా విషయంలో నయన్ ఎంతో హుషారుగా కాదనుకుండా ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
`మన శంకరవరప్రసాద్ గారు` సినిమా లాంచింగ్ కి ముందే ఒక ప్రీలాంచ్ వీడియో షూట్ లో పాల్గొంది. సినిమా చిత్రీకరణ పూర్తయి, ఎట్టకేలకు ప్రీరిలీజ్ దశకు వచ్చే ముందే దర్శకుడు అనీల్ రావిపూడితో కలిసి ఒక వీడియో షూట్ లో పాల్గొంది నయన్. సినిమా ప్రమోషన్స్ కోసం ఒక ఫన్నీ వీడియోలో నటించింది.
ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకకు నయనతార హాజరు కాలేదు. ప్రీరిలీజ్ వేదికపై కనిపించకపోయినా కానీ, మెగాస్టార్ చిరంజీవి నుంచి మెప్పు పొందింది. బాస్ నేటి సాయంత్రం శిల్పకళా వేదికలో జరిగిన ప్రీరిలీజ్ వేదికపై నయన్ ని పొగిడేసిన తీరు ఆశ్చర్యపరిచింది. నిజానికి నయనతారకు సినిమాల ప్రమోషన్స్ కి వచ్చే అలవాటు లేదు. కానీ అనీల్ రావిపూడి ఏం చేసాడో కానీ, ప్రచారానికి చక్కగా సహకరించింది. కొన్ని సరదా వీడియోల చిత్రీకరణలో పాల్గొంది. ఇక ఈ సినిమాలో తన నటన అద్భుతం. నయనతార లేనిదే ఈ పాత్ర లేదు! అన్నంత డెడికేషన్‌తో నటించింది! అంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు.
