మెగా మల్టీస్టారర్ కు రంగం సిద్ధమవుతుందా?
ఒకే సినిమాలో ఇద్దరు స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా ఆ సినిమాకు ఇద్దరి హీరోల అభిమానులతో పాటూ మూవీ లవర్స్ కూడా దానిపై ఎంతో ఆసక్తిగా ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 28 Feb 2026 6:00 PM ISTఈ మధ్య మల్టీస్టారర్ క్రేజ్ బాగా ఎక్కువైపోయింది. ఈ మల్టీస్టారర్లకు వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్లు స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా ఆ సినిమాకు ఇద్దరి హీరోల అభిమానులతో పాటూ మూవీ లవర్స్ కూడా దానిపై ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టాలీవుడ్ లో పలు మల్టీస్టారర్లు వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.
అయితే టాలీవుడ్ లో కొన్ని మల్టీస్టారర్లు జరిగితే బావుండని అందరూ అనుకునే కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి. అలాంటి కాంబినేషన్ లో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంగ్త్ మూవీ చేస్తే ఎలా ఉంటుందో చూడ్డానికి అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కల నిజమవుతుందేమో అన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
మెగా బద్రర్స్ కు కథ చెప్పిన డైరెక్టర్
తాజా సమాచారం ప్రకారం, ఓ ప్రముఖ తెలుగు డైరెక్టర్ మెగా బ్రదర్స్ ను కలిసి ఓ పవర్‌ఫుల్ మల్టీస్టారర్ కథను వినిపించినట్టు తెలుస్తోంది. కథలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండేలా, ఎమోషన్స్, యాక్షన్, ఫ్యాన్స్ మూమెంట్స్ ను జోడించి స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ నెరేషన్ అయిందని, మెగా బ్రదర్స్ డెసిషన్ కోసం డైరెక్టర్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం.
గత కొన్నేళ్లుగా టాప్ స్టార్లుగా రాణిస్తున్న చిరూ, పవన్
ఇంకా ఈ ప్రాజెక్టు పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా, ఈ న్యూస్ మెగా ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మెగాస్టార్ చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఆయన తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాలుగా స్టార్ హీరోగా కంటిన్యూ అవుతూ భారీ ఫ్యాన్స్ బేస్ ను సొంతం చేసుకుని, ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు.
శంకర్ దాదా జిందాబాద్ లో పవన్ గెస్ట్ రోల్
గతంలో చిరూ, పవన్ కలిసి శంకర్ దాదా జిందాబాద్ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో పవన్ క్యామియో కొన్ని నిమిషాలే అయినా, థియేటర్లలో ఫ్యాన్స్ చేసిన హంగామా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఒక్క ఫైట్ సీన్‌కే ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ రాగా ఇక ఈ మెగా బ్రదర్స్ ఫుల్ లెంగ్త్ చేస్తే ఆ అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ చెప్పిన ఆ కథకు అన్నదమ్ములు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ ప్రాజెక్టు టాలీవుడ్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచే అవకాశముంది. మరి మెగా బ్రదర్స్ కు మల్టీస్టారర్ కథను చెప్పిన డైరెక్టర్ ఎవరు? ఏంటి అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
