అన్నదమ్ముల్ని కలిపే సమయం ఆసన్నం!
టాలీవుడ్ బిగ్ బ్రదర్స్ కలిసే సమయం ఆసన్నమైందా? అన్నదమ్ముల మల్టీస్టారర్ కి ఇదే సరైన సమయమా? అంటే అవుననే అనాలి.
By: Srikanth Kontham | 21 Sept 2025 10:48 PM ISTటాలీవుడ్ బిగ్ బ్రదర్స్ కలిసే సమయం ఆసన్నమైందా? అన్నదమ్ముల మల్టీస్టారర్ కి ఇదే సరైన సమయమా? అంటే అవుననే అనాలి. ఇంతకీ ఎవరా బిగ్ బ్రదర్స్! ఏంటా కహానీ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. వారే మెగాస్టార్ చిరంజీవి-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తెలుగు సినిమా పాన్ ఇండియాని ఏల్తోన్న వేళ అన్నదమ్ములిద్దరు చేతులు కలపడానికి ఇదే సరైన సమయం. ఇంతకు మించిన మంచి సమయం మరొకటి లేదు. `సైరా నరసింహారెడ్డి` చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టారు. `హరిహరవీరమల్లు` సినిమాతో పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ ఇమేజినేషనే అద్భుతంగా:
కానీ అన్నదమ్ములిద్దరికీ తొలి పాన్ ఇండియా సినిమాలు కలిసి రాలేదు. సైరా-వీరమల్లు రెండు పాన్ ఇండియాలో అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలో బ్రదర్స్ ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్ ని సంయుక్తంగా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? అదిరిపోదు. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇద్దరు కలిసి పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా చేస్తే ఇండియాలో రికార్డులు తిరగరాయడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. ముందు ఎంత మంది తారలు పాన్ ఇండియాని షేక్ చేసినా? కోట్లాది మంది అభిమానులున్న చిరంజీవి-పవన్ చేతులు కలిపారంటే మిరాకిల్ తధ్యం.
స్నేహితుడితో సినిమా సంతోషంగా:
ఆ ద్వయానికి సరైన దర్శకుడు తోడైతే చాలు. బాక్సాఫీస్ లెక్కలు సరిచేసే బాధ్యతలు అన్నదమ్ములు చూసుకుం టారు. ఆ కాంబినేషన్ కి సరైన దర్శకుడు ఎవరు అంటే? త్రివిక్రమ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వాళ్లని డీల్ చేయగల సామర్ధ్యం ఉన్నది గురూజీ ఒక్కరే. ఇద్దరితోనే మంచి సాన్నిహిత్యం ఉంది. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ క్లోజ్ ప్రెండ్. అతడిని ఎంతో దగ్గరగా చూసిన వ్యక్తి కూడా. కలిసి సినిమాలు చేసారు. త్రివిక్రమ్ ఏం చెప్పినా వినే నటుడు కూడా. ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ కి ఎంత మాత్రం ఆస్కారం కూడా ఉండదు.
గురూజీ మనసులో ఏముందో:
ఇద్దరు కలిసి సినిమా చేసి కూడా చాలా కాలమవుతోంది. గురూజీ అంటే చిరంజీవి అంతే విశ్వశిస్తారు. అతడితో సినిమా చేయాలని చిరంజీవి సైతం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. సరైన కథ కుదరకే చిరంజీవి వద్దకు ఇంత వరకూ తాను చేరలేదన్నది గురూజీ వెర్షన్. ఇవన్నీ సమసి పోవాలంటే? ఇద్దరి ఇమేజ్ కి తగ్గ ఓ స్టోరీ సిద్దం చేసి పాన్ ఇండియాకి కనెక్ట్ చేస్తే సరి. తన మార్క్ కంటెంట్ తో అద్భుతాలు చేయగల ప్రతిభావంతుడు త్రివిక్రమ్. తాను కూడా ఎంతో కాలంగా పాన్ ఇండియా సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అన్నదమ్ముల్ని ఒకే తాటిపైకి తీసుకొస్తే సరి. అందుకు సరైన సమయం కూడా ఇదే. మరి గురూజీ ఏమంటారో!
