Begin typing your search above and press return to search.

కొణిదెల సింహానికి 'నటసింహం' పురస్కారం.. ఒక్కొక్క మాట అద్భుతమే!

అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో- విజువల్ (ఏవీ) వేడుకకు వచ్చిన అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  M Prashanth   |   20 March 2026 10:56 AM IST
కొణిదెల సింహానికి నటసింహం పురస్కారం.. ఒక్కొక్క మాట అద్భుతమే!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో అరుదైన ఘనత మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. హైదరాబాద్‌ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ చేతుల మీదుగా ఆ అవార్డు స్వీకరించారు చిరు.

అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన ఆడియో- విజువల్ (ఏవీ) వేడుకకు వచ్చిన అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ వాయిస్ ఓవర్, చిరంజీవి సినీ ప్రయాణాన్ని క్లియర్ గా చూపించే పాత సినిమాల విజువల్స్, అలాగే లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావుతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని చూపించిన క్షణాలు ప్రేక్షకులను అలరించాయి.

పలువురు సినీ ప్రముఖులు తెలిపిన ప్రశంసలు కూడా ఆ ఏవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదే సమయంలో వీడియోలో వినిపించిన వాయిస్ ఓవర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. "రెండు తెలుగు రాష్ట్రాలు ఉప్పొంగుతున్న వేళ.. వెండితెరను బంగారు కానుకగా భావించే సందర్భం.. అన్నగారి పురస్కారం అన్నయ్యకు అందించడం ఒక తరం నుంచి మరో తరానికి గౌరవం" అంటూ వినిపించిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.

ఎన్టీఆర్‌ ను విష్ణువుతో పోల్చుతూ, చిరంజీవిని శివునిగా నటించిన సినిమాలను గుర్తుచేస్తూ వాడిన పదాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. నటనతో కట్టిపడేసిన ఎన్టీఆర్, నాట్యంతో మెప్పించిన చిరంజీవి.. ఇద్దరూ తమ తమ కాలాల్లో అగ్రస్థానాన్ని అందుకుని ప్రజల గుండెల్లో నిలిచారని పేర్కొనడం విశేషం. అందుకే అడవి రాముడి పురస్కారాన్ని కొండవీటి దొంగ దొరలా స్వీకరిస్తున్నారు అనే వ్యాఖ్య ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

సామాజిక సేవలో కూడా ఇద్దరి మధ్య ఉన్న కామన్ థింగ్స్ ను వాయిస్ ఓవర్‌ లో ప్రస్తావించారు. ఎన్టీఆర్ స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు గుర్తుచేస్తూ, చిరంజీవి నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తనిధి, నేత్రనిధి కార్యక్రమాలు ప్రస్తావించారు. "ఆ మహనీయుడి పురస్కారానికి ఈ మహనీయుడి కంటే అర్హుడు ఎవరు?” అంటూ ప్రశ్నిస్తూ, చిరంజీవి వ్యక్తిత్వాన్ని కొనియాడిన విధానం అభిమానులను మరింత ఉత్సాహ పరిచింది.

చివరగా మెగాస్టార్ అసలు పేరు శంకర వరప్రసాద్‌ ను ప్రస్తావిస్తూ, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచే వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. ఆ ఏవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులు ఆ వీడియోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కో పదం అద్భుతంగా ఉందని, చిరంజీవి– ఎన్టీఆర్‌ ల గొప్పతనాన్ని బాగా చెప్పారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా చిరంజీవికి లభించిన ఆ గౌరవం ఆయన సినీ సేవలకు మాత్రమే కాకుండా, సమాజానికి చేసిన సేవలకు కూడా నిదర్శనంగా నిలుస్తోందని చెప్పాలి.