Begin typing your search above and press return to search.

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

నాలుగు దశాబ్దాలుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్న చిరంజీవి, నాగార్జున తాజాగా ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్‌లో కలిసి పాల్గొన్నారు. మంచి స్క్రిప్ట్‌తో వస్తే మల్టీస్టారర్‌కు సిద్ధమని ఇద్దరూ గతంలోనే చెప్పారు. తాజాగా మరోసారి ఈ అంశంపై స్పందించడంతో తమ కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

By:  Ramesh Palla   |   18 Nov 2026 4:49 PM IST
చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!
X

టాలీవుడ్ సీనియర్ హీరోల మధ్య స్నేహం ఉండదని, పోటీ తత్వం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం మందికి ఒకరితో ఒకరికి మంచి స్నేహం లేదని, ఆ కారణంగానే మల్టీ స్టారర్‌ సినిమాలు రాలేదు అనేది చాలా మంది అభిప్రాయం. బాలీవుడ్‌ స్టార్స్ మధ్య ఉన్నట్లుగా టాలీవుడ్‌ స్టార్స్ మధ్య అనుబంధం, స్నేహం లేదని, అందుకే మల్టీ స్టారర్‌ సినిమాలు రావడం లేదని చాలా కాలం నుంచే అభిప్రాయం ఉంది. ఒకప్పుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఆ తర్వాత కృష్ణ, కృష్ణం రాజు, శోభన్‌ బాబు వంటి దిగ్గజాలు సైతం స్నేహంగా ఉండేవారు. కానీ ఆ తర్వాత తరం నుంచి స్టార్స్ మధ్య స్నేహం కనిపించడం లేదని చాలా మంది అంటారు. కానీ చిరంజీవి, నాగార్జున మధ్య ఉండే స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా మంచి మిత్రులుగా కొనసాగుతూ వస్తున్నారు.

చిరంజీవి, నాగార్జున స్నేహం...

నాగార్జున, చిరంజీవి వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ మంచి స్నేహితులు అని చాలా సార్లు నిరూపితం అయ్యింది. నాగార్జున వ్యక్తిగత కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొనడం, చిరంజీవి ఇంట్లో వేడుకలకు నాగార్జున హాజరు కావడం మనం చూస్తూనే ఉన్నాం. నాగార్జున కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌ హీరోలుగా నటించిన సినిమాలకు చిరంజీవి ఇచ్చిన ప్రోత్సాహం ఏంటో అందరికీ తెలిసిందే. ఇక రామ్‌ చరణ్‌తో నాగార్జున ఎంత సన్నిహితంగా ఉండటాడో కూడా మనం పలు కార్యక్రమాల్లో చూశాం. తాజాగా నాగార్జున, చిరంజీవి కలిసి 'ఇట్లు అర్జున' సినిమా సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వీరిద్దరు మరోసారి తమ స్నేహం గురించి చెప్పకనే చెప్పారు. చిరంజీవిని అన్నయ్య అనాలి అనుకుంటున్నాను అంటూ అభిమానుల ముందు నాగార్జున చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చరణ్‌ తనను అన్నయ్య అంటాడని కూడా నాగార్జున చెప్పిన విషయం తెల్సిందే.

ఇట్లు అర్జున సినిమా సక్సెస్‌ మీట్‌...

ఈతరం హీరోలు కొందరు స్నేహంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం ఇలా కలివిడిగా కనిపించడం లేదు. లేట్‌ నైట్‌ పార్టీలకు అయితే హాజరు అవుతున్నారు కానీ అభిమానుల ముందుకు ఇలా కలిసి మాత్రం రావడం లేదు. ఇలా అభిమానుల ముందుకు కలిసి వస్తే ఫ్యాన్‌ వార్స్ ఉండవు అనేది కొందరి అభిప్రాయం. ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకోవడం వల్ల ఫ్యాన్స్‌లో సైతం విభేదాలు అనేవి తక్కువగా వస్తాయి. హీరోలు స్నేహంగా ఉంటున్నారు కనుక మనమూ కలిసి పోదాం అన్నట్లుగా ఫ్యాన్స్‌లో ఒక అవగాహణ అనేది వస్తుంది. చిరంజీవి, నాగార్జున స్నేహం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న విషయం తెల్సిందే. వారిద్దరూ రెగ్యులర్‌గా ఏదో ఒక వేదికపై కలవడం వల్ల ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు అనేవి చాలా తక్కువగా వింటూ ఉంటాం. ఇతర హీరోల ఫ్యాన్స్ మద్య మాత్రం తరచూ సోషల్‌ మీడియాలో లేదా బాహిరంగంగానే గొడవలు జరుగుతూ ఉంటాయి.

చిరు, నాగ్‌ మల్టీస్టారర్‌..

చిరంజీవి, నాగార్జున స్నేహం ను మరో అడుగు ముందుకు తీసుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఇట్లు అర్జున సక్సెస్ మీట్‌ సందర్భంగా ఇద్దరు హీరోలు కలిసి పాల్గొనడంతో అభిమానులు మల్టీస్టారర్‌ సినిమాను డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ఇద్దరు నాలుగు దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మల్టీస్టారర్‌ మూవీ చేయలేదు. అందుకు కారణాలు ఏంటీ అనేది పక్కన పెట్టి ఇప్పుడు వీరి కాంబోలో మల్టీస్టారర్‌ రావాలని కోరుకుంటున్న వారికి బిగ్‌ సర్‌ప్రైజ్‌ను ఈ ఇద్దరు హీరోలు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్ని సంవత్సరాలకు అయినా కచ్చితంగా వీరి కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ రావడం ఖాయం. మంచి స్క్రిప్ట్‌తో వస్తే మల్టీస్టారర్‌ కి రెడీ అని వీరిద్దరు గతంలో చెప్పారు, తాజాగా ఇట్లు అర్జున సినిమా సక్సెస్ వేడుకలో పాల్గొన్న సమయంలోనూ పేర్కొన్నారు. కనుక రచయితలు, దర్శకులు కథలను రెడీ చేసుకోవడమే తరువాయి.