Begin typing your search above and press return to search.

చిరంజీవి- మోహన్ బాబు.. టైటిల్స్ విషయంలో అంత జరిగిందా?

టాలీవుడ్‌ సీనియర్ నటులు చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే.

By:  M Prashanth   |   15 April 2026 11:13 AM IST
చిరంజీవి- మోహన్ బాబు.. టైటిల్స్ విషయంలో అంత జరిగిందా?
X

టాలీవుడ్‌ సీనియర్ నటులు చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ చర్చనీయాంశమే. స్నేహితులుగా కనిపించినా, పోటీ, అభిప్రాయ భేదాలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా చెప్పుకుంటుంటారు.

ఇటీవల సీనియర్ రచయిత, దర్శకుడు కానగల జయకుమార్ ఒక ఇంటర్వ్యూలో పాత జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా 1981లో విడుదలైన కిరాయి రౌడీలు సినిమా సమయంలో జరిగిన ఓ ఘటనను వివరించారు. ఈ చిత్రానికి క్రాంతి కుమార్ నిర్మాతగా వ్యవహరించగా, ఇందులో చిరంజీవి, మోహన్ బాబు, రాధిక ప్రధాన పాత్రలు పోషించారు.

సినిమా చివరి పనులు జరుగుతున్న సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చిందని జయకుమార్ తెలిపారు.

ఒక రోజు నిర్మాత క్రాంతి కుమార్ ఆఫీస్‌ కు వెళ్లినప్పుడు, 'ఏంటి ఎన్ని సార్లు కాల్ చేశారు?' అని అన్నారని, అది ఎవరి గురించి అని అడిగితే మోహన్ బాబు గురించి అని చెప్పారట. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని జయకుమార్‌ ను మోహన్ బాబు ఇంటికి వెళ్లమని సూచించారట. దీంతో జయకుమార్ మోహన్ బాబు ఇంటికి వెళ్లగా.. ఆయన నేరుగా టైటిల్స్ గురించి మాట్లాడారట.

'చిరంజీవి కంటే నేను సీనియర్‌.. కాబట్టి నా పేరు ముందుగా వేయాలి' అని మోహన్ బాబు చెప్పారని వెల్లడించారు. దీనిపై జయకుమార్ నిర్మాతతో మాట్లాడతానని చెప్పగా.. 'నువ్వే టైటిల్స్ రాస్తున్నావు కాబట్టి.. నా పేరు ముందే రాయాలి' అని మోహన్ బాబు స్పష్టం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని తిరిగి నిర్మాత క్రాంతి కుమార్‌ కు చెప్పగా.. అప్పుడు ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేశారట.

'మనమే డబ్బులు పెట్టి సినిమా తీస్తుంటే.. వాళ్ళు చెప్పినట్టు టైటిల్స్ మార్చాలా?' అని ప్రశ్నించారట. అయితే ఈ విషయంలో ఎవరినీ నొప్పించకుండా ఎలా పరిష్కరించాలనే దానిపై క్రాంతి కుమార్ చాలా ఆలోచించారని జయకుమార్ తెలిపారు. చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. టైటిల్స్‌ లో ముందుగా మోహన్ బాబు పేరు వేయగా.. చివర్లో చిరంజీవి పేరును ప్రత్యేకంగా హైలైట్ చేసేలా ప్రదర్శించారట. ఈ విధంగా ఇద్దరు నటుల గౌరవాన్ని కాపాడేలా టైటిల్స్ డిజైన్ చేసినట్లు వివరించారు.

ఆ సంఘటన చూస్తే.. ఆ కాలంలో కూడా స్టార్ హీరోల మధ్య టైటిల్స్ వంటి విషయాలు ఎంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయో అర్థమవుతుంది. అదే సమయంలో నిర్మాతలు, టెక్నీషియన్లు ఇలాంటి పరిస్థితులు ఎల హ్యాండిల్ చేసేవారో కూడా తెలుస్తుంది. మొత్తంగా చూస్తే.. చిరంజీవి, మోహన్ బాబు మధ్య ఉన్న అనుబంధం కేవలం స్నేహంతో మాత్రమే కాకుండా.. పోటీ, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అప్పుడప్పుడు వచ్చిన విభేదాలతో కూడుకుని ఉందని మరోసారి అర్థమవుతోంది.