Begin typing your search above and press return to search.

చిరు 'మెగావర్స్'.. ఇక నెట్‌ఫ్లిక్స్ వంతు!

కొన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుగా అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఆ తర్వాత షూటింగ్ మొదలవుతుంది.

By:  M Prashanth   |   29 Oct 2026 4:53 PM IST
చిరు మెగావర్స్.. ఇక నెట్‌ఫ్లిక్స్ వంతు!
X

కొన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుగా అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఆ తర్వాత షూటింగ్ మొదలవుతుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ షో విషయంలో మాత్రం రివర్స్‌లో జరుగుతోంది. కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి. షూటింగ్ కూడా మొదలైపోయింది. అయినా నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో కొంత సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడు ఆ పని కూడా పూర్తయింది.




చిరంజీవితో కలిసి నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా 'మెగావర్స్' పోస్టర్ విడుదల చేసింది. భారీ స్టేజ్, మధ్యలో ఎర్రటి కుర్చీ, వెనుక చిరంజీవి షాడో డిజైన్ చేశారు. మాస్‌కు గ్రామర్, స్టైల్‌కు డెఫినిషన్ అంటూ మెగాస్టార్ ఇమేజ్‌ను హైలైట్ చేశారు. 'చిరంజీవీస్ మెగావర్స్' అనే టైటిల్‌ను కూడా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇప్పటివరకు ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం నెట్‌ఫ్లిక్స్ ప్రకటనతో మరో స్థాయికి చేరుకుంది.

నిజానికి ఈ షో షూటింగ్ మంగళవారమే మొదలైంది. తొలి ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, సత్య కనిపించనున్నట్లు ఇప్పటికే సమాచారం బయటకొచ్చింది. మెగాస్టార్‌తో ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బ్రహ్మానందంతో చిరంజీవికి ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్వయంగా రంగంలోకి దిగడంతో ప్రమోషన్లకు కూడా మార్గం సుగమమైంది. అయితే పోస్టర్‌లో అతిథుల పేర్లు, ఎపిసోడ్ల లాంటి వివరాలను ఇంకా వెల్లడించలేదు.

చిరంజీవికి హోస్టింగ్‌లో ఇప్పటికే అనుభవం ఉంది. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని నడిపించారు. అయితే అది ప్రశ్నలు, సమాధానాలతో సాగే గేమ్ షో. ఈసారి సెలబ్రిటీలతో సరదాగా ముచ్చటించే టాక్ షో చేస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవితో సుదీర్ఘ అనుబంధం ఉన్న నటులు ఎదురుగా కూర్చుంటే ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు బయటకు రావచ్చు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఈ ఫార్మాట్‌కు బాగా ఉపయోగపడుతుంది.

మరోవైపు నెట్‌ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లో చిరంజీవి షో రావడం కూడా ఆసక్తికరమైన పరిణామం. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర భాషల ప్రేక్షకులకు కూడా ఈ కార్యక్రమం చేరే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగానే టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులను తీసుకొస్తారా అనే ఆసక్తి నెలకొంది. అయితే నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన తొలి పోస్టర్‌లో మాత్రం పూర్తిగా మెగాస్టార్ బ్రాండ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఆటమ్ మీడియా వెంచర్స్, ఎస్ఓఎల్ ప్రొడక్షన్స్ సంస్థలను నెట్‌ఫ్లిక్స్ తన పోస్టులో హైలెట్ చేసింది. డిసెంబర్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమవుతుందనే ప్రచారం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి 'కమింగ్ సూన్' అని మాత్రమే పేర్కొంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన నేపథ్యంలో త్వరలో ప్రోమో విడుదల చేసే అవకాశముంది. అందులో షో ఫార్మాట్‌తో పాటు అతిథుల వివరాలపై మరింత క్లారిటీ రావచ్చు.