మెగావర్స్ టాక్ షో... డిజిటల్లో గేమ్ ఛేంజర్ అవుతుందా?
ఇప్పటికే ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌లోనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హాస్య నటులు సునీల్ , సత్య అతిథులుగా హాజరవడం విశేషం.
By: Sivaji Kontham | 27 Oct 2026 3:02 PM ISTతెలుగు బుల్లితెర - ఓటీటీ వినోద ప్రపంచంలో రియాలిటీ షోల హవా ఎప్పుడూ పీక్స్‌లోనే ఉంటుంది. ఇప్పటివరకు బుల్లితెరపై `బిగ్ బాస్` షో ద్వారా అక్కినేని నాగార్జున తనదైన హోస్టింగ్ నైపుణ్యంతో రేటింగ్స్‌లో `కింగ్`గా నిలిచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించారు. పూర్వం `మీలో ఎవరు కోటీశ్వరుడు` వంటి కాన్సెప్ట్ ఆధారిత షోలతో రక్తి కట్టించారు. ఆ తర్వాత దీనికి బ్రేక్ పడినా బిగ్ బాస్ వేదికగా నాగార్జున చూపిస్తున్న టైమింగ్, సీరియస్‌నెస్ .. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉన్నాయి. ఈ ధోరణి ఒకవైపు నడుస్తుండగానే ఆహా లో నందమూరి బాలకృష్ణ `అన్‌స్టాపబుల్` షోతో అడుగుపెట్టి ఓటీటీ సెలబ్రిటీ టాక్ షోల ముఖచిత్రాన్నే మార్చేశారు. బాలయ్య ఎనర్జీ, నిర్మొహమాటమైన సంభాషణలు ఆ షోను చారిత్రాత్మక విజయం దిశగా నడిపాయి.
ఇలాంటి పరిస్థితులలో గ్లోబల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సౌత్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ మెగాస్టార్ చిరంజీవితో `మెగావర్స్ (MEGAVerse)` టాక్ షోను ప్రకటించడం సరికొత్త సంచలనానికి తెర తీసింది. ఇది ఒక సాధారణ షోలా కాకుండా.. తెలుగు డిజిటల్ రంగానికి నిజమైన `గేమ్ ఛేంజర్`గా మారే సంకేతాలను ఇస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై కోట్లాది మందిని అలరించిన చిరంజీవి ఇప్పుడు ఓటీటీ వేదికగా డిజిటల్ వీక్షకులను ఎలా ఆకట్టుకుంటారనే ఆసక్తి విశ్లేషకుల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది.
ఇప్పటికే ఈ షోకి సంబంధించిన షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్‌లోనే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హాస్య నటులు సునీల్ , సత్య అతిథులుగా హాజరవడం విశేషం. చిరంజీవి సుదీర్ఘ నటనా ప్రయాణంలో బ్రహ్మానందం, సునీల్ కాంబినేషన్ అందించిన వినోదం మరచిపోలేనిది. అలాంటి దిగ్గజ కామెడీ టైమింగ్ ఉన్న నటులతో పాటు నేటితరం కామెడీ సెన్సేషన్ సత్య కూడా జతకలవడం మొదటి ఎపిసోడ్‌పై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. చిరు స్పొంటేనిటీ.. కామెడీ టైమింగ్ ఓటీటీ ఫార్మాట్‌కు తగ్గట్లు ఎలా సెట్ అవుతుందనేది ఈ ఎపిసోడ్‌తో స్పష్టం కానుంది.
భారతీయ చలనచిత్ర రంగాన్ని పరిశీలిస్తే.. అమితాబ్ బచ్చన్ (కౌన్ బనేగా కరోడ్‌పతి), మోహన్ లాల్, కమల్ హాసన్ (బిగ్ బాస్) వంటి దిగ్గజ నటులు తమ సమకాలీన కెరీర్లో బుల్లితెర, డిజిటల్ వేదికలపై అడుగుపెట్టి అద్భుతమైన విజయాలను సాధించారు. వారి బాటలోనే నాగార్జున, బాలకృష్ణ కూడా తెలుగులో సరికొత్త రికార్డులను నెలకొల్పారు. ఇప్పుడు అదే దిగ్గజాల సరసన చిరంజీవి తన `మెగావర్స్`తో రీఎంట్రీ ఇస్తుండడం.. అది కూడా అంతర్జాతీయ వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్‌లో రావడం ద్వారా తెలుగు ఓటీటీ మార్కెట్ స్థాయి మరింత గ్లోబల్‌గా మారే అవకాశం ఉంది.
మొత్తానికి బిగ్ బాస్‌తో నాగార్జున, అన్స్టాపబుల్తో బాలకృష్ణ సృష్టించిన ప్రభావాన్ని దాటి.. మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేకమైన మ్యాజిక్, అనుభవంతో నెట్‌ఫ్లిక్స్ లో ఎటువంటి సరికొత్త ట్విస్టులు ఇస్తారు? తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రూపురేఖలను ఎలా మార్చేస్తారు? అనేదే ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ `మెగావర్స్` షో రాకతో తెలుగు ఓటీటీ రంగానికి మరో నూతన అధ్యాయం ప్రారంభం కానుందనడంలో సందేహం లేదు.
