Begin typing your search above and press return to search.

ఇత‌ర షోల‌తో పోలిస్తే 'మెగావ‌ర్స్' ప్ర‌త్యేక‌త అదే!

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ టాక్ షో ‘మెగావర్స్’ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 30న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో షో స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నారు. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలు అతిథులుగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి తన సహజమైన ముచ్చట్లతో ఈ షోను ఎలా నడిపిస్తారో చూడాలి.

By:  Sivaji Kontham   |   23 Nov 2026 7:58 AM IST
ఇత‌ర షోల‌తో పోలిస్తే మెగావ‌ర్స్ ప్ర‌త్యేక‌త అదే!
X

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ఓటీటీ వేదికపై హోస్టింగ్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ టాక్ షో `మెగావర్స్` తో బాస్ కొత్త‌ ప్రయాణంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రతిష్టాత్మక టాక్ షో లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చ‌ర్చ‌గా మారింది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్ సంస్థ నవంబర్ 30న హైదరాబాద్‌లో `మెగావర్స్` గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలోనే షో స్ట్రీమింగ్ తేదీతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరిగింది. ఇందులో టాలీవుడ్ అగ్ర కథానాయకులు అక్కినేని నాగార్జున, ప్రభాస్, రవితేజ సహా పలువురు స్టార్ హీరోలు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నట్లు సమాచారం. చిరంజీవి తనదైన హాస్యం, అనుభవాలతో ఈ స్టార్ హీరోలతో జరిపే ముచ్చట్లు అభిమానులకు కనులవిందుగా ఉండబోతున్నాయి.

వెండితెరపై తన అద్బుత‌మైన‌ నటన, డ్యాన్సులతో దశాబ్దాలుగా అలరిస్తున్న మెగాస్టార్ ఇప్పుడు `మెగావర్స్` రూపంలో డిజిటల్ తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు? త‌ర్వాత చిరు ప్ర‌యోగం ఎలా వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాల‌ని అంద‌రూ వేచి చూస్తున్నారు. నవంబర్ 30న లాంచింగ్ ఈవెంట్‌తో ఈ షోపై మరింత స్పష్టత రానుంది.

ఆ రెండిటికి తేడా అదే:

పొరుగు భాషల నుంచి అరువు తెచ్చుకున్న ఫార్మాట్ షోలలో ముందుగా నిర్ణయించిన నియమాలు.. కృత్రిమ డ్రామా ఎక్కువగా కనిపిస్తే... పూర్తిగా మన నేటివిటీతో రూపొందిన ఒరిజినల్ టాక్ షోలలో సహజమైన ఆత్మీయత.. మన సంస్కృతికి తగ్గ సంభాషణలు హైలైట్ అవుతాయి. ఈ కోణంలోనే విదేశీ ఫార్మాట్ అయిన `బిగ్ బాస్` వివాదాలు, టాస్క్‌లు, ఎలిమినేషన్ల చుట్టూ సాగే రియాలిటీ గేమ్ షోగా ఉంటే.. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ `మెగావర్స్`మాత్రం ఎలాంటి కృత్రిమ హంగులు లేకుండా మెగాస్టార్ చిరంజీవి తన సహచర స్టార్ హీరోలతో జరిపే ఆత్మీయ- సరదా ముచ్చట్ల వేదికగా నిలుస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.