స్వీటీ ఆ మెగా ఆఫర్ ను అందుకుంటుందా?
ఇప్పుడీ సినిమాపై కూడా అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరూని బాబీ సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 1 Oct 2025 7:00 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలను చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసిన చిరంజీవి, ప్రస్తుతం టాలీవుడ్ హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు సినిమా చేస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీబిజీగా చిరూ
శంకరవరప్రసాద్ గారు షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తైందని సమాచారం. ఈ రెండు కాకుండా చిరూ మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టారు. అందులో ఒకటి బాబీ దర్శకత్వంలో సినిమా కాగా, మరోటి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో. ఈ రెండింటిలో బాబీతో ముందు సెట్స్ పైకి వెళ్లనున్నారు చిరూ.
బాబీతో మెగా 158
మెగాస్టార్ కెరీర్ లో 158వ సినిమాగా రూపొందనున్న ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఆల్రెడీ వచ్చేసింది. ఇదిలా ఉంటే చిరూ, బాబీ కాంబినేషన్ లో గతంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడీ సినిమాపై కూడా అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో చిరూని బాబీ సరికొత్తగా ప్రెజెంట్ చేయనున్నట్టు తెలుస్తోంది.
చిరూ పక్కన అనుష్క ను తీసుకోవాలనే ఆలోచనలో బాబీ
అది మాత్రమే కాకుండా క్యాస్టింగ్ విషయంలో కూడా బాబీ చాలా ఆచితూచి అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెగా158 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ స్వీటీ అనుష్క ను బాబీ రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. చిరూతో కలిసి అనుష్క ఇప్పటివరకు ఏ సినిమాలోనూ నటించింది లేదు. గతంలో స్టాలిన్ లో ఓ సాంగ్ లో మాత్రమే కనిపించిన అనుష్కను ఇప్పుడు చిరూ సరసన ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా తీసుకోవాలని బాబీ ప్రయత్నిస్తున్నారట.
చిరూ పక్కన యంగ్ హీరోయిన్లను తీసుకుంటుంటే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలోనే బాబీ ఈ డెసిషన్ తీసుకున్నారని సమాచారం. అయితే బాబీ అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ గత కొంతకాలంగా సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న స్వీటీ, చిరూతో ఆఫర్ ను ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
