ఫెడరేషన్ (X) ఛాంబర్ : మెగాస్టార్ ఇంట్లో పంచాయితీ
సినీనిర్మాతలు, ఫెడరేషన్ మధ్య ఎప్పుడూ సఖ్యత నీటి మీద బుడగ లాంటిది. అది ఎప్పుడు పేల్తుందో తెలీదు.
By: Sivaji Kontham | 5 Aug 2025 10:48 PM ISTసినీనిర్మాతలు, ఫెడరేషన్ మధ్య ఎప్పుడూ సఖ్యత నీటి మీద బుడగ లాంటిది. అది ఎప్పుడు పేల్తుందో తెలీదు. 30శాతం వేతన పెంపు అంశం కొన్నేళ్లుగా నలుగుతున్న పంచాయితీ. దీనిని పరిష్కరించనంతవరకూ ఈ వార్ ఇలానే కొనసాగుతుందని పదే పదే నిరూపణ అవుతోంది. గడిచిన కొన్నేళ్లలో పలుమార్లు ఫెడరేషన్ (సినీకార్మిక సమాఖ్య) అల్టిమేటం జారీ చేసినా, సమ్మెలు చేసినా కానీ నిర్మాతలు ఏనాడూ దిగి రాలేదు. చర్చల పేరుతో ఫెడరేషన్ ప్రయత్నాలను నీరుగార్చారు. ముఖ్యంగా నిర్మాతల గిల్డ్ దీనిని ముందుకు నడిపించింది.
అయితే ఈసారి మాత్రం సినిమా కార్మికుల తరపున ఫెడరేషన్ గట్టి పట్టు పడుతున్నట్టు అర్థమవుతోంది. 30 శాతం వేతనాలు తక్షణం పెంచని యెడల షూటింగులు బంద్ చేస్తామని, తమ డిమాండ్ కు సహకరించే నిర్మాతల కోసమే కార్మికులు సెట్స్ కి వస్తారు అని ప్రకటించారు. అయితే ఫిలింఛాంబర్- నిర్మాతల మండలి సంయుక్తంగా దీనికి ససేమిరా అనడంతో పరిస్థితి మరింత ఝటిలంగా మారింది. గడిచిన రెండు రోజులుగా కార్మికులు మెరుపు సమ్మెతో షూటింగులు నిలిచిపోయాయి. ముఖ్యంగా రిలీజ్ తేదీలు ప్రకటించి డెడ్ లైన్లతో పని చేస్తున్న నిర్మాతలకు ఇది తలనొప్పి వ్యవహారంగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమను ఆదుకునేందుకు ఒక పెద్ద దిక్కు కావాలి. అది మెగాస్టార్ చిరంజీవి అయితేనే కరెక్ట్ అని నిర్మాతలు భావించారు. తక్షణం మెగా పరిష్కారం కోసం నేరుగా చిరు ఇంటి గడప తొక్కారు బడా నిర్మాతలు. నిర్మాతల గిల్డ్ పెద్దలతో పాటు, సినిమాలు తీసే నిర్మాతలు అంతా ఇప్పుడు చిరంజీవి ఇచ్చే పరిష్కారం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు జూబ్లీహిల్స్ లోని మెగాస్టార్ ఇంటికి ఫెడరేషన్ ప్రతినిధులను పిలిపించాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. సమ్మె విరమింపజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఫెడరేషన్ పెద్దలు మాత్రం కచ్ఛితంగా తమ డిమాండ్లు నెరవేర్చుకునేవరకూ పంతం పట్టి కూచున్నారని తెలిసింది. ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ (నిర్మాతల మండలి సభ్యులు) వార్ ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తారో వేచి చూడాలి.
