మెగాస్టార్.. బుల్లితెరను కూడా బ్లాస్ట్ చేశాడుగా..
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ఇంకా తగ్గకముందే, ఇప్పుడు బుల్లితెరపై కూడా తన విశ్వరూపాన్ని చూపించారు.
By: M Prashanth | 13 March 2026 5:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ ఇంకా తగ్గకముందే, ఇప్పుడు బుల్లితెరపై కూడా తన విశ్వరూపాన్ని చూపించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఓటీటీ లో కూడా ట్రెండింగ్ లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బుల్లితెరపై కూడా అదే రేంజ్ లో సౌండ్ చేస్తోంది.
ఇటీవల జీ తెలుగులో ప్రసారమై ఏకంగా 14.2 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 28న జరిగిన ఈ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే, మెగాస్టార్ క్రేజ్ వెండితెరపైనే కాదు.. ఇళ్లలో కూడా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. థియేటర్లకు వెళ్లని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఎంతగా ఆదరించారో ఈ నెంబర్లు చెబుతున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా, అటు చిరంజీవి కెరీర్‌లోనూ, ఇటు అనిల్ రావిపూడి కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో రికార్డులు తిరగరాయడమే కాకుండా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 లో కూడా గత నెలలో వచ్చినప్పుడు భారీ వ్యూస్ రాబట్టింది. ఇప్పుడు టీవీలో కూడా అదే జోరును కొనసాగిస్తూ 'క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్' అని నిరూపించుకుంది.
ఒక రకంగా చెప్పాలంటే థియేటర్, ఓటీటీ, టీవీ.. ఇలా మూడు చోట్లా ఈ సినిమా హ్యాట్రిక్ రికార్డులు సృష్టించింది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి, చిరంజీవి మేనరిజమ్స్ తోడవ్వడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం. గత కొంతకాలంగా మెగాస్టార్ నుండి పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒక విందు భోజనంలా అనిపించింది. ఈ భారీ విజయంపై అనిల్ రావిపూడి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
థియేటర్లలో చూపించిన అదే ఉత్సాహాన్ని, నవ్వులను బుల్లితెరపై కూడా కొనసాగించినందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కేవలం మాస్ అంశాలకే పరిమితం కాకుండా భావోద్వేగాలను కూడా సమానంగా పండించడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రస్తుత కాలంలో పెద్ద సినిమాలు విడుదలైన నెల రోజులకే టీవీల్లో వచ్చేస్తున్నాయి. ఇలాంటి పోటీలో కూడా 14.2 రేటింగ్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.
సోషల్ మీడియాలో కూడా ఈ రేటింగ్స్ గురించి చర్చ నడుస్తోంది. చిరంజీవి తన వింటేజ్ లుక్ తో ప్రేక్షకులను మరోసారి మాయ చేశారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినిమాలోని సంభాషణలు, చిరు టైమింగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను పక్కాగా కనెక్ట్ చేశాయి. ఒక సినిమాకు సరైన కంటెంట్ తోడైతే అది ఏ ప్లాట్‌ఫారమ్‌లో వచ్చినా ఆదరిస్తారని 'శంకరవరప్రసాద్ గారు' మరోసారి ప్రూవ్ చేశారు.
2026 ప్రారంభంలోనే చిరంజీవి ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఆయన తన తదుపరి చిత్రాలను కూడా అదే ఎనర్జీతో పూర్తి చేస్తున్నారు. థియేటర్లలో చూడలేకపోయిన వారు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్న వారు టీవీకి అతుక్కుపోవడంతో ఈ రేటింగ్స్ సాధ్యమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ కూడా వస్తుండటంతో భవిష్యత్తులో జరిగే మరిన్ని టెలికాస్ట్ లలో కూడా ఈ సినిమా మంచి టీఆర్పీని నమోదు చేసే అవకాశం ఉంది. మెగాస్టార్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్దే కాదు.. బుల్లితెరపై కూడా ఎవర్ గ్రీన్ అని ఈ చిత్రం నిరూపించింది.
