కండలు లేవు, సిక్స్ ప్యాక్ లేదు.. ఆ లుక్ ఏంటి బాస్?
మన శంకర వరప్రసాద్ గారు 'శశిరేఖ' పాట కోసం చిరంజీవి వేసిన కాస్ట్యూమ్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.
By: M Prashanth | 4 Dec 2025 3:19 PM ISTఏడు పదుల వయసు అంటే సాధారణంగా రిటైర్ అయ్యే దశ. కానీ ఇక్కడ మాత్రం సీన్ వేరు. ఒక హీరో తన వయసును కేవలం ఒక నంబర్ గా మార్చేసి, కుర్రాళ్లకు పోటీ ఇచ్చేలా తయారవ్వడం మామూలు విషయం కాదు. ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ అయినా సరే, ఏజ్ బార్ అవుతున్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి. ఏమాత్రం తేడా వచ్చినా, గెటప్ సెట్ కాకపోయినా జనం ఇట్టే కనిపెట్టేస్తారు. దొరికిపోతారు. కానీ మెగాస్టార్ విషయంలో ఆ ఛాన్స్ ఎవరికీ దొరకడం లేదు.
మన శంకర వరప్రసాద్ గారు 'శశిరేఖ' పాట కోసం చిరంజీవి వేసిన కాస్ట్యూమ్స్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఎరుపు రంగు షర్ట్, వైట్ ప్యాంట్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. ఈ తరహా బట్టలు వేసినప్పుడు బాడీ లాంగ్వేజ్ లో కాస్త లోపం ఉన్నా, మొహంలో ఓల్డేజ్ కనిపించినా ఆ మొత్తం లుక్ ఎబ్బెట్టుగా మారుతుంది. కానీ బాస్ ఆ డ్రెస్ లో ఎంతో హుందాగా, అంతకుమించి స్టైలిష్ గా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చిరు సిక్స్ ప్యాక్ చేయలేదు, భారీగా కండలు పెంచలేదు. కేవలం తన శరీర ఆకృతిని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేశారు. అనవసరపు ఆర్భాటాలు లేకుండా, సింపుల్ గా నిల్చున్నా ఆ స్టిల్ లో ఒక రాయల్టీ కనిపిస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటేనే సగం వయసు తగ్గిపోయినట్లు అనిపిస్తోంది. ఫిట్నెస్ అంటే కండలు తిప్పుకోవడం కాదని, స్మార్ట్ గా ఉండటమని ఈ లుక్ నిరూపిస్తోంది.
గత కొన్నేళ్లుగా చిరంజీవి లుక్స్ పై రకరకాల చర్చలు జరిగాయి. 'గాడ్ ఫాదర్' సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెప్పించినా, అది వయసుకి తగ్గ పాత్ర. కానీ ఇప్పుడు చేస్తున్నది రొమాంటిక్ సాంగ్. ఇలాంటి సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా విమర్శలు తప్పవు. కానీ చిరు తీసుకున్న కేర్ వల్ల, ఇప్పుడు ఆ లుక్ వింటేజ్ రోజులను గుర్తుచేస్తోంది. ఈ మధ్య కాలంలో చిరంజీవి బెస్ట్ లుక్ ఇదేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ముఖంలో ఆ గ్లో, కళ్ళజోడు పెట్టుకున్న తీరు, నిల్చున్న స్టిల్.. ఇవన్నీ ఒక లెక్క ప్రకారం డిజైన్ చేసుకున్నట్లు ఉన్నాయి. తన వయసును కవర్ చేయడానికి గ్రాఫిక్స్ అవసరం లేకుండా, కేవలం తన ప్రజెంటేషన్ తోనే మ్యాజిక్ చేశారు. పక్కన నయనతార ఉన్నా, అందరి చూపు చిరు వైపే వెళ్లేలా ఆకర్షించడం సామాన్యమైన విషయం కాదు.
సినిమా జయాపజయాలు పక్కన పెడితే, 70 ఏళ్ల వయసులోనూ తనను తాను ఇలా మలుచుకోవడం వెనుక ఉన్న కృషిని మెచ్చుకోవాల్సిందే. కుర్ర హీరోలు కూడా మెయింటైన్ చేయడానికి కష్టపడే గ్లామర్ ని, చిరు ఇంత ఈజీగా ఎలా హ్యాండిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ ఒక్క ఫోటోతో 'బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్' అని మరోసారి రుజువైంది.
