కొదమ సింహం 4కే ట్రైలర్ ఇంట్రెస్టింగ్
ఈ రోజుల్లో 4కేలో రీమాస్టర్ చేసిన పాత సినిమాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు.
By: Sivaji Kontham | 13 Nov 2025 9:18 AM ISTఈ రోజుల్లో 4కేలో రీమాస్టర్ చేసిన పాత సినిమాలను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారు. ఇటీవల విడుదలైన నాగార్జున-ఆర్జీవీ సినిమా `శివ` 4కే వెర్షన్ థియేటర్లలో చక్కని ఆదరణ పొందుతోంది. ఈ సినిమా సౌండ్ క్వాలిటీ, విజువల్ నాణ్యత గురించి చాలా చర్చ జరిగింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన `కొదమ సింహం`(1990) చిత్రాన్ని దాదాపు 35ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజ్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.
కొదమ సింహం చిత్రాన్ని 4కేలో రీమాస్టర్ చేసి, అద్భుతమైన డాల్బీ సౌండ్ క్వాలిటీతో తిరిగి రిలీజ్ చేస్తున్నారు. 5.1 సరౌండ్ సౌండ్‌తో 4Kలో దీనిని రీమాస్టర్ చేసారు. రిచ్ విజువల్ క్వాలిటీ ప్రజలను థియేటర్ల వైపు లాగుతుందని చెబుతున్నారు. 1990లో విడుదలైన ఈ సినిమాని 35 ఏళ్ల తర్వాత రీరిలీజ్ చేయడానికి అప్‌గ్రేడ్ చేయడం ఆసక్తికరం. ఈరోజుల్లో ప్రేక్షక దేవుళ్లు విజువల్ నాణ్యత - సౌండ్ క్వాలిటీతో క్లాసిక్ సినిమాలను చూడాలనే ఆసక్తి ఉండటమే ఇటీవలి రీరిలీజ్ ల విజయాలకు సూచిక.
తాజాగా టైమ్ లెస్ క్లాసిక్ `కొదమ సింహం` 4కే ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం సౌండ్ క్వాలిటీ చాలా స్పష్ఠంగా వినిపిస్తోంది. విజువల్ నాణ్యతను ప్రజలు థియేటర్లలో వీక్షించి వెల్లడించాల్సి ఉంటుంది. నిధి వేట కాన్సెప్ట్, ద్రోహం, తండ్రిని కాపాడుకునేందుకు కొడుకు పోరాటం లాంటి అంశాలతో రూపొందించిన ఈ చిత్రానికి రాజ్ -కోటి సంగీతం ప్రధాన అస్సెట్. ఈ సినిమాలో చిరంజీవి కౌబోయ్ గెటప్ లో అద్భుతంగా నటించారు. ఇందులో మోహన్ బాబు `పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్` జాక్ స్పారో తరహా వేషధారణ, బాడీ లాంగ్వేజ్ తో నటనను కొత్త లెవల్ కి తీసుకెళ్లారు. మోహన్ బాబు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో హాస్యం, ఎనర్జీతో థియేటర్లలో ప్రేక్షకులను గొప్పగా అలరించారు. ఇక చిరంజీవి- రాధ కాంబినేషన్ పాటలు, వాణీ విశ్వనాథ్ తో చిరు రొమాన్స్ కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణ.
రామా ఫిల్మ్స్ పతాకంపై కైకాల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించగా, కె.మురళి మోహన్ రావు దర్శకత్వం వహించారు. కైకాల సత్యనారాయణ ఇందులో కీలక పాత్రలో నటించారు. ఆరోజుల్లోనే అడ్వాన్స్ డ్ థింకింగ్ తో రూపొందించిన ఈ చిత్రం టైమ్ లెస్ క్లాసిక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సాహసోపేతమైన దృశ్యాలతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్ ని ఆవిష్కరంచిన మెగాస్టార్ వెల్లడించారు.
