Begin typing your search above and press return to search.

'ఖైదీ' చిత్రానికి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఖైదీకి త‌ర్వాత అంటూ ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు వ‌ర్ణిస్తారు.

By:  Sivaji Kontham   |   31 March 2026 9:49 AM IST
ఖైదీ చిత్రానికి చిరంజీవి పారితోషికం ఎంతో తెలుసా?
X

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని ఖైదీకి ముందు ఖైదీకి త‌ర్వాత అంటూ ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు వ‌ర్ణిస్తారు. చిరంజీవిని ఒక సామాన్య నటుడి నుంచి అగ్ర కథానాయకుడిగా మార్చిన చిత్రం `ఖైదీ`. 28 అక్టోబర్ 1983న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమా విజయంతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక కొత్త మాస్ స్టార్ లభించారు. అప్పట్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాశాయి.

హాలీవుడ్ యాక్షన్ సినిమా `ఫస్ట్ బ్లడ్` నుంచి స్ఫూర్తి పొంది ఈ కథను రూపొందించారు. నిర్మాత ఎం. తిరుపతి రెడ్డి కోరిక మేరకు పరుచూరి సోదరులు అద్భుతమైన సంభాషణలు రాశారు. దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి పోషించిన సూర్యం పాత్ర ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఇందులో సూర్యం పాత్ర సిల్వ‌స్ట‌ర్ స్టాలోన్ లుక్ ని ప్ర‌తిబింబించ‌డ‌మే కాదు, ఫ‌స్ట్ బ్ల‌డ్ రేంజు ప‌వ‌ర్ ఫుల్ న‌ట‌న‌తో ఆయ‌న క‌ట్టి ప‌డేసారు.

ఈ సినిమాలో చిరు ఆహార్యం ఒక ట్రెండ్ సెట్టర్‌. ముఖ్యంగా ఆయన ధరించిన నల్లటి స్లీవ్‌లెస్ టీషర్ట్ - ప్యాంట్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ డ్రెస్సింగ్ స్టైల్‌ను చిరంజీవి స్వయంగా డిజైన్ చేసుకోవడం విశేషం. అప్పట్లో ప్రతి కుర్రాడు సూర్యం లాగే డ్రెస్ వేసుకోవాలని ఆరాటపడేవారంటే దాని ప్ర‌భావం ఏ రేంజులో వ‌ర్క‌వుటైందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆర్థికంగా కూడా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో చిరంజీవి పారితోషికం కేవలం రూ.1.75 లక్షలు మాత్రమే. కానీ ఈ సినిమా ఏకంగా రూ. 8 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిరంజీవి కెరీర్‌లో 1 కోటి పైగా షేర్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఇది నిలిచిపోయింది.

`ఖైదీ` అనే పేరు చిరంజీవికి ఒక లక్ ఇచ్చే సెంటిమెంట్‌గా మారింది. అందుకే ఆయన తన కెరీర్‌లో `ఖైదీ నెం. 786` అనే మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని అందించారు. రాజకీయాల తర్వాత తన 150వ సినిమాగా `ఖైదీ నెం. 150` అనే సినిమాను చేసారు. ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించడం విశేషం. ఖైదీ సినిమాతో మొదలైన ఆయన జైత్ర‌యాత్ర‌ నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. దాదాపు 157 సినిమాల్లో న‌టించిన చిరంజీవి త‌దుప‌రి `విశ్వంభ‌ర` (158)తో ప్ర‌పంచ‌వ్యాప్త ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. ఈరోజు 60 ప్ల‌స్ వ‌య‌సులో 70కోట్ల పారితోషికం, అద‌నంగా లాభాల్లో వాటా అందుకుంటున్న అగ్ర క‌థానాయ‌కుడిగా చిరు హ‌వా సాగిస్తున్నారు.