విశ్వంభర టీమ్ ఇప్పుడు చేయాల్సిందేమిటి?
ఒకే సంక్రాంతి.. ఒకే హీరో.. రెండు సినిమాలు.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ లా కనిపిస్తున్నా.. సినిమాల పరంగా అంత ఈజీ మ్యాటర్ కాదు.
By: M Prashanth | 18 Sept 2026 1:21 PM ISTఒకే సంక్రాంతి.. ఒకే హీరో.. రెండు సినిమాలు.. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ లా కనిపిస్తున్నా.. సినిమాల పరంగా అంత ఈజీ మ్యాటర్ కాదు. కాకా జనవరి 13న థియేటర్లలోకి రావడం ఖాయమైపోయింది. దీంతో ఇన్నాళ్లుగా సంక్రాంతి రేసుపై ఆశలు పెట్టుకున్న విశ్వంభర టీమ్ ఇప్పుడు అసలు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సంక్రాంతికే వస్తారా.. లేక ఇంకో డేట్ చూసుకుంటారా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కాకా మూవీని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ రీసెంట్ గా మరోసారి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అంతేకాదు.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రాబోతుందని చెప్పడంతో ఆ సినిమా రిలీజ్ పై ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని క్లారిటీ ఇచ్చేసినట్లే. దీంతో సంక్రాంతి బరిలో కాకా ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. అదే సమయంలో విశ్వంభర పరిస్థితి భిన్నంగా ఉంది.
చాలా కాలంగా ఆ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడింది. గతంలో సంక్రాంతి 2027పై కూడా వార్తలు వచ్చాయి. జనవరి 9న విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా.. మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా తేదీ ప్రకటించలేదు. ఇప్పుడు కాకా డేట్ లాక్ కావడంతో విశ్వంభర విషయంలో అసలు సమస్య మొదలైంది.
నాలుగు రోజుల తేడాతో రెండు చిరంజీవి సినిమాలు థియేటర్లలోకి వస్తే ఎలా ఉంటుందనేది ప్రశ్న. హీరో ఒక్కరే అయినా.. సినిమాలు రెండూ వేర్వేరు కథలు, జానర్లు. అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టి, థియేటర్ల కేటాయింపు, షోల సంఖ్య వంటి విషయాల్లో రెండు సినిమాల మధ్య ఎఫెక్ట్ ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. మరోవైపు విశ్వంభర ఇప్పటికే లేట్ అయిన సినిమా. అందుకే ఇంకాస్త ఆలస్యం చేయకుండా సంక్రాంతికే తీసుకురావాలని కొందరు భావిస్తున్నారు.
కానీ అదే సమయంలో కాకాతో పోటీ పడటం ఎందుకనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ముఖ్యంగా చిరంజీవి సినిమాలే ఒకదానితో ఒకటి పోటీ పడే పరిస్థితి వస్తే అభిమానుల్లో అయోమయం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు విశ్వంభర టీమ్ ముందున్న మరో ఆప్షన్ సమ్మర్ రిలీజ్. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని మంచి డేట్ చూసుకుని వస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టి.. టీజర్, ట్రైలర్, పాటలతో సినిమాపై హైప్ పెంచుతూ.. సోలోగా లేదా తక్కువ పోటీ ఉన్న సమయంలో థియేటర్లలోకి తీసుకురావడం ఒక ప్లాన్ గా ఉపయోగపడొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
కానీ విశ్వంభర మరోసారి రిలీజ్ వాయిదా అంటే అభిమానులు మళ్లీ నిరాశ పడొచ్చు. కాబట్టి డేట్ మార్చినా.. ఆ డెసిషన్ ను కేవలం వాయిదాగా కాకుండా పక్కా ప్లానింగ్ తో తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త తేదీని ముందుగానే ప్రకటించి, ప్రమోషన్స్ ను పక్కాగా నడిపించాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే ఆలస్యమైన విశ్వంభర కు డేట్ కంటే సరైన డేట్ ముఖ్యమనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
