చిరు సంక్రాంతి లెక్క.. ఇప్పుడు క్లియర్ అయినట్టే!
ఆ సినిమా ‘విశ్వంభర’. కొద్ది రోజుల క్రితం ‘కాకా’ను వెనక్కి జరిపి ‘విశ్వంభర’ను సంక్రాంతికి తీసుకురావచ్చనే టాక్ వచ్చింది.
By: M Prashanth | 17 Sept 2026 12:56 PM IST‘కాకా’ రిలీజ్ డేట్ విషయంలో టీమ్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. 2027 జనవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ సింగిల్ కూడా త్వరలోనే వస్తుందని చెప్పింది. గత కొద్ది రోజులుగా చిరంజీవి సంక్రాంతి ప్లాన్‌పై వేరే ప్రచారం నడుస్తున్న సమయంలో ఈ అప్డేట్ రావడం వల్ల ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చినట్లయింది. ఈ డేట్ కొత్తది కాకపోయినా మళ్లీ టీమ్ నుంచే రావడం వల్ల మధ్యలో వచ్చిన రూమర్స్‌కు కూడా సమాధానం వచ్చినట్టైంది.
ఆ సినిమా ‘విశ్వంభర’. కొద్ది రోజుల క్రితం ‘కాకా’ను వెనక్కి జరిపి ‘విశ్వంభర’ను సంక్రాంతికి తీసుకురావచ్చనే టాక్ వచ్చింది. ఓటీటీ డీల్ పూర్తయిందనే వార్తలు కూడా అదే సమయంలో వచ్చాయి. చాలా కాలంగా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సినిమా కావడంతో జనవరి సీజన్‌ను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారనే ప్రచారం జరిగింది. అందుకే ‘కాకా’ డేట్ మారుతుందా అనే డౌట్ కూడా వచ్చింది.
జనవరి మధ్యలోనే రెండు సినిమాల పేర్లు ఒకేసారి వినిపించడంతో మెగా ఫ్యాన్స్‌లో ఏది వస్తుందనే కన్ఫ్యూజన్ కూడా పెరిగింది. అక్కడి నుంచే కొత్త లెక్క మొదలైంది. కానీ ‘కాకా’ టీమ్ ఇప్పుడు డేట్‌ను మరోసారి అధికారికంగా చెప్పడంతో ఆ అవకాశం దాదాపు తగ్గిపోయినట్లే కనిపిస్తోంది. ఒకే హీరో నటించిన రెండు పెద్ద సినిమాలను ఒకే పండగ సీజన్‌లో తీసుకురావడం జరిగే పని కాదు.
బాబీతో చిరంజీవి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ కూడా సంక్రాంతికే వచ్చి పెద్ద హిట్ అయింది. ఈసారి కూడా అదే సీజన్‌ను ముందుగానే లాక్ చేశారు. ‘విశ్వంభర’ విషయానికి వస్తే రిలీజ్ డేట్ సమస్య ఇప్పటిది కాదు. మొదట జనవరి 2025కి అనుకున్నారు. తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులు, ఇతర కారణాలతో పలుమార్లు వాయిదా పడింది. 2026లో కూడా కొన్ని డేట్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. లేటెస్ట్ గా ఓటీటీ డీల్ పూర్తయిందని, కొత్త రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి.
ఇప్పుడు సంక్రాంతి స్లాట్ ‘కాకా’ దగ్గరే ఉండటంతో ‘విశ్వంభర’కు మరో డేట్ చూడాల్సి రావచ్చు. 2027 వేసవి గురించి గతంలోనే కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. చిరంజీవి సినిమా కావడంతో మంచి హాలిడే విండోనే చూస్తారు. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తయ్యే సమయం, అప్పటికి రిలీజ్‌కు సిద్ధంగా ఉండే ఇతర పెద్ద సినిమాల డేట్లు చూసుకుని కొత్త తేదీని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ‘కాకా’ మాత్రం ప్రమోషన్స్ వైపు అడుగు వేస్తోంది. ఫస్ట్ సింగిల్ త్వరలో వస్తుందని టీమ్ చెప్పడం కూడా అదే ప్లాన్‌లో భాగం. జనవరి 13 డేట్ మళ్లీ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ‘విశ్వంభర’ మేకర్స్ నుంచి వచ్చే అప్డేట్ పైనే ఫోకస్ పడుతుంది. ఇక విశ్వంభర నుంచి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
