Begin typing your search above and press return to search.

'కాకా'తో చిరు సంక్రాంతి హ్యాట్రిక్‌...!

నేడు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 'కాకా' సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, టైటిల్‌ గ్లిమ్స్‌ను విడుదల చేయడం జరిగింది.

By:  Ramesh Palla   |   22 Aug 2026 2:00 PM IST
కాకాతో చిరు సంక్రాంతి హ్యాట్రిక్‌...!
X

టాలీవుడ్‌లో సంక్రాంతి సినిమాల సెంటిమెంట్‌ ఎక్కువ అవుతోంది. తెలుగు సినిమాలకు సంక్రాంతి అత్యంత కీలకమైన సీజన్‌ అనడంలో సందేహం లేదు. ఆ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ మెప్పించే విధంగా సినిమాలు చేస్తే వందల కోట్ల వసూళ్లు కురుస్తున్నాయి. టాలీవుడ్‌కి మొదటి నుంచి సంక్రాంతి కలిసి వస్తూనే ఉంది. ఇప్పుడు అది ఎక్కువ అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు మూడు నాలుగు అంతకు మించి సంక్రాంతికి విడుదల కావడం మనం చూస్తున్నాం. 2027 సంక్రాంతికి కూడా పెద్ద పోటీ ఉండబోతుంది. అనిల్‌ రావిపూడి మరోసారి సంక్రాంతికి తన అదృష్టంను పరీక్షించుకోబోతున్నాడు. ఈ సారి వెంకటేష్, కళ్యాణ్‌ రామ్‌లతో కలిసి అనిల్ రావిపూడి రాబోతున్న విషయం తెల్సిందే. ఇక తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తన 'కాకా' సినిమాను సైతం 2027 సంక్రాంతి బరిలో దించుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా...

నేడు మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 'కాకా' సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు, టైటిల్‌ గ్లిమ్స్‌ను విడుదల చేయడం జరిగింది. జనవరి 13న సంక్రాంతి కానుకగా చిరంజీవి, బాబీ కాంబోలో రూపొందుతున్న 'కాకా' ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. మొదట జనవరి 12న అనుకున్నప్పటికీ అనిల్‌ రావిపూడి ఆ డేట్‌కు రాబోతున్న నేపథ్యంలో ఒక్క రోజు ఆలస్యంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. 2026 సంక్రాంతికి చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇక అంతకు ముందు చిరంజీవి, బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సైతం సంక్రాంతికి విడుదల అయ్యింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చిన చిరంజీవి హిట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాత 2026లో మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమాతో సంక్రాంతి హిట్‌ను దక్కించుకున్నాడు.

చిరంజీవి, బాబీ మూవీ 'కాకా'...

కాకా సినిమాతో 2027 సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి హిట్‌ను దక్కించుకుంటే సంక్రాంతి హ్యాట్రిక్ దక్కించుకున్న అరుదైన హీరోగా చిరంజీవి రికార్డ్‌ను సొంతం చేసుకున్నట్లు అవుతుంది. 2024, 2025ల్లో కొన్ని కారణాల వల్ల చిరంజీవి నుంచి సినిమాలు రాలేదు. ఆ ఏడాదిల్లో చిరంజీవి సంక్రాంతి సీజన్‌లో లేడు. కనుక 2023, 2026 సంక్రాంతి సీజన్‌లకు వాల్తేరు వీరయ్య, మన శంకరవర ప్రసాద్‌ గారు సినిమాలతో వచ్చి హిట్‌ అందుకుని ఇప్పుడు 27 సంక్రాంతికి కాకాతో వచ్చి హిట్‌ కొట్టబోతున్నాడు. కాకా సినిమా గురించి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి చిరంజీవి కాస్త ఏజ్‌ ఎక్కువ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. పెద్ద అమ్మాయికి తండ్రి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల వారు కాకా వైపు ఆసక్తిగా చూస్తున్నారు. చిరంజీవి చిత్రం అనగానే అభిమానుల్లో ఏం అంచనాలు ఉంటాయో ఆ అంచనాలను బాబీ అందుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

2027 సంక్రాంతికి కాకా మూవీతో...

చిరంజీవిని 'కాకా' సినిమాలో డ్యయల్‌ రోల్‌ లో చూపించబోతున్నారు అనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి డ్యూయల్‌ రోల్‌ తో అలరించిన సినిమాలు రాలేదు. అందుకే ఇప్పుడు చిరంజీవి డబుల్‌ రోల్‌తో వస్తే కచ్చితంగా 2027 సంక్రాంతి మెగా ఫ్యాన్స్‌ కి డబుల్‌ ధమాకా అనడంలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు బాబీ ఈ సినిమాను పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా, మెగా ఫ్యాన్స్ కోసం అన్నట్లుగా, సంక్రాంతి మూవీగా రూపొందిస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు, జెట్‌ స్పీడ్‌గా రూపొందుతున్న ఈ సినిమా మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలను మోస్తోంది.

చిరంజీవి, బాబీ కాంబో హిట్‌ కాంబో కావడంతో అంచనాలు సహజంగానే మరింత పెరగడం ఖాయం. దర్శకుడు బాబీ ఆ అంచనాలకు అనుగుణంగా సినిమాను రూపొందిస్తున్నాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అతి త్వరలోనే షూటింగ్‌ పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ మొదలు పెట్టబోతున్నారు. ఇదే సమయంలో సినిమాను కాస్త అగ్రసివ్‌గా సంక్రాంతి సీజన్‌లో గట్టి పోటీ ఇచ్చే విధంగా ప్రమోట్‌ చేయడానికి చిరంజీవి ఆసక్తిగా ఉన్నారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. 2027 సంక్రాంతికి హిట్‌ కొట్టి చిరంజీవి హ్యాట్రిక్‌ దక్కించుకుంటాడా అనేది చూడాలి.