Begin typing your search above and press return to search.

చిరుతో బాబీ.. ఈసారి టార్గెట్ అదేనా..

ఒక్కసారి మెగాస్టార్‌ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడమే పెద్ద ఛాన్స్. అలాంటిది ఒకసారి హిట్ కొట్టిన తర్వాత అదే హీరోతో మరో సినిమా చేసే అవకాశం వస్తే.. అంచనాలు మరింత పెరుగుతాయి.

By:  M Prashanth   |   4 Sept 2026 3:27 PM IST
చిరుతో బాబీ.. ఈసారి టార్గెట్ అదేనా..
X

ఒక్కసారి మెగాస్టార్‌ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడమే పెద్ద ఛాన్స్. అలాంటిది ఒకసారి హిట్ కొట్టిన తర్వాత అదే హీరోతో మరో సినిమా చేసే అవకాశం వస్తే.. అంచనాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి పరిస్థితి కూడా ఇదే. వాల్తేరు వీరయ్యతో చిరంజీవిని పక్కా మాస్ అవతార్‌ లో చూపించి మెప్పించిన బాబీ.. ఇప్పుడు కాకాతో మరోసారి రానున్నారు. దీంతో ఈసారి ఆయన టార్గెట్ ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి ఇమేజ్‌ ను బాబీ ఏ స్థాయిలో ఉపయోగించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్, కామెడీ, ఎమోషన్‌ తో పాటు అభిమానులు కోరుకునే ఎలివేషన్స్‌ ను భారీగా ఇచ్చారు. ఇప్పుడు కాకా విషయంలోనూ చిరంజీవి మాస్ ఇమేజ్‌ నే నమ్ముకున్నారా? అంటే.. టీజర్ చూస్తే అలా అనిపించడం లేదు. ఈసారి మాస్‌ తో పాటు కథలో ఒక ఇంట్రెస్టింగ్ మిస్టరీని కూడా పెట్టినట్టు కనిపిస్తోంది.

కాకాలో చిరంజీవి సత్యం అనే ఆక్వా ఇండస్ట్రీ సూపర్‌వైజర్ రోల్ లో కనిపించనున్నారు. మొదట ఆ రోల్ చాలా సింపుల్‌ గా కనిపిస్తుంది. ఫ్యామిలీ, వర్క్ అంటూ సాధారణ జీవితం గడిపే వ్యక్తిలా కనిపించే సత్యం.. ఒక్కసారిగా తనలోని మరో యాంగిల్ ను బయటపెడతాడు. నీటిలో పడిపోయిన తాళం చెవులను తీసే సన్నివేశంలో ఆయుధాలు బయటపడటం.. అక్కడి నుంచి కథపై ఆసక్తిని పెంచుతోంది.

అంతేకాదు.. చిరంజీవిని సినిమాలో రెండు భిన్నమైన షేడ్స్‌లో చూపిస్తున్నారు. ఒకటి సింపుల్‌ గా కనిపించే సత్యం అయితే.. మరోటి పూర్తిగా భిన్నమైన, స్టైలిష్ లుక్. ఆ రెండు షేడ్స్ మధ్య అసలు సంబంధం ఏంటి? సత్యం గతం ఏమిటి? అతని జీవితంలో దాగి ఉన్న కథ ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఇదే బాబీ ఈసారి పెట్టుకున్న కొత్త టార్గెట్‌ గా కనిపిస్తోంది. గత సినిమాలో చిరంజీవి ఇమేజ్‌ ను ముందుకు తీసుకొచ్చిన ఆయన.. ‘కాకా’లో మాత్రం ఆ ఇమేజ్ వెనుక ఒక కథను దాచే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అంటే అభిమానులు కోరుకునే మాస్ ట్రీట్ ఉండటంతో పాటు.. సాధారణ ప్రేక్షకుడిని కథతో కట్టిపడేసే అంశాలను కూడా యాడ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం సంక్రాంతి సెంటిమెంట్. ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సీజన్‌ లోనే వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు కాకాను కూడా అదే సీజన్‌ కు తీసుకొస్తున్నారు. జనవరి 13న విడుదలను ప్రకటించారు. దీంతో బాబీ మరోసారి సంక్రాంతి సెంటిమెంట్‌ ను నమ్ముకున్నారా అనే చర్చ కూడా మొదలైంది.

అయితే గత రిజల్ట్ ను మళ్లీ రిపీట్ చేయడం మాత్రం బాబీకి అంత ఈజీ కాదు. చిరంజీవితో రెండోసారి పనిచేస్తుండడం వల్ల ప్రేక్షకులు గత సినిమాతో కంపేర్ చేయడం ఖాయం. అందుకే కాకాలో మాస్‌ తగ్గించకుండా.. కొత్తదనం, ట్విస్టులు, చిరంజీవి క్యారెక్టర్‌ లో భిన్నమైన షేడ్స్‌ చూపించడం కీలకం. మెగాస్టార్‌ ను మాస్ హీరోగా చూపించడం ఒక ఎత్తైతే.. ఆయన ఇమేజ్ వెనుక దాగి ఉన్న మరో యంగిల్ బయటకు తీయడం మరో ఎత్తు. అదే బాబీ ఈసారి టార్గెట్ అయితే.. కాకా సంక్రాంతి బరిలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.