ఆ సినిమా నాతో ఎందుకు చేయలేదని స్టార్ డైరెక్టర్ ను అడిగిన చిరంజీవి...
స్వయం కృషి తో పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటుడు చిరంజీవి.
By: Gopi Velupala | 14 Oct 2026 9:00 PM ISTస్వయం కృషి తో పరిశ్రమలోకి అడుగుపెట్టి, తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటుడు చిరంజీవి. వరుసగా ఆరు సంవత్సరాలు ఆరు ఇండస్ట్రీ హిట్లను సంపాదించుకొని మాస్ లో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. మాస్ లో అంతటి భారీ ఇమేజ్ ఉన్నప్పటికి వైవిధ్యమైన పాత్రలు చేయాలనే తపన తనలో ఎప్పుడూ ఉండేది. దాని నుంచే చిరంజీవికి కళాతపస్వి కే విశ్వనాథ్ కి మధ్య ఒక ఆసక్తి కరమైన సంభాషణ జరిగింది.
ఆ కథ రాసినప్పుడు నేను గుర్తురాలేదా?
కళాతపస్వి కే విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన 'స్వాతిముత్యం' సినిమా 1986వ సంవత్సరంలో వచ్చి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా మొదటి షో చూసిన చిరంజీవి నేరుగా విశ్వనాధ్ దగ్గరికి వెళ్లి ఈ మూవీ నాకు బాగా నచ్చిందని చెప్పి, ఆ కథను రాసుకున్నప్పుడు మీకు నేను గుర్తుకు రాలేదా అని విశ్వనాథ్ గారిని సరదాగా అడిగాడట. దానికి విశ్వనాథ్ నవ్వుతూ స్వాతిముత్యం సినిమాలో శివయ్య (కమల్ హాసన్) క్యారెక్టర్ ఏమీ తెలియని ఒక అమాయకుడు.
అలాంటి పాత్రలో నిన్ను చూపిస్తే నీకున్న మాస్ ఇమేజ్ కి ప్రేక్షకులు థియేటర్లో సీట్లను చించేస్తారు, మూవీ చూడడానికి కూడా ఇష్టపడరు. చిరంజీవి అంటే స్క్రీన్ మీద కనిపించే మాస్ హీరో...అలాంటి పర్సన్ ఇలాంటి అమాయకుడి పాత్ర చేయడం కరెక్ట్ కాదు. ఒక వేళ చేసిన దర్శకుడిగా నీతో అలాంటి సినిమా చేసినందుకు నీ ఫ్యాన్స్ నన్ను తిడతారని చెప్పారట. దాంతో చిరంజీవి సైతం విశ్వనాధ్ గారి మాటలతో ఏకీభవించాడు. మొత్తానికైతే కమల్ హాసన్ ఆ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించాడు అంటూ చిరంజీవి విశ్వనాథ్ తో చెప్పారట.
చిరంజీవి గొప్ప నటుడు...
ఇదంతా చిరంజీవి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కే విశ్వనాథ్ చిరంజీవి కాంబినేషన్లో శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నింటిలో చిరంజీవి యాక్టింగ్ చాలా గొప్ప గా ఉంటుంది. 'స్వయం కృషి' సినిమాలో చెప్పులు కుట్టే వాడి క్యారెక్టర్ లో చిరంజీవి నటించి మెప్పించడం అనేది మామూలు విషయం కాదు. ఇక 'ఆపద్బాంధవుడు' సినిమాలో చిరంజీవి పోషించిన మాధవ క్యారెక్టర్ చిరంజీవిలోని సరికొత్త నటుడిని బయటకు తీసింది. శివుడి గెటప్ వేసుకొని చిరంజీవి చేసే నృత్యం గాని, సముద్ర తీరంలో శివలింగాన్ని చేసి దేవుడు లేడు అంటూ నిస్సహాయంగా అరుస్తూ శివలింగాన్ని సముద్రంలోకి విసిరేసే సీన్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. చిరంజీవిలోని పూర్తి స్థాయి నటుడిని బయటికి తీసిన సినిమా ఆపద్బాంధవుడు కావడం విశేషం...
