తొక్కేస్తాడు! అనే ప్రచారానికి మెగా బాస్ కౌంటర్ ఇదేనా?
మాస్ మహారాజ్ తాజా సినిమా `ఇరుముడి`ని అభినందిస్తూ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
By: Sivaji Kontham | 28 Aug 2026 9:37 AM ISTమాస్ మహారాజ్ తాజా సినిమా `ఇరుముడి`ని అభినందిస్తూ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనపై సాగిస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని చిరు ఏవిధంగా సీరియస్ గా తీసుకున్నారో ఈ సన్నివేశం చెబుతోంది. అంతేకాదు తన ట్రోలర్స్ పై బాస్ చాలా సింపుల్ గా కౌంటర్ ఎటాక్ చేసారనే చర్చ సాగుతోంది. ఎక్స్ ఖాతాలో రవితేజపై అభినందనల ట్వీట్ చివర్లో చిరంజీవి రాసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
''ఒక సినిమా విజయం పరిశ్రమలోని అందరికీ పండుగ. ఈ పరిశ్రమ అందరిదీ... ఏ కొందరిదో కాదు.. మనం బతకాలి, .. ఇతరులను బతికించాల''ని చిరు పేర్కొన్నారు. పైకి ఇది సాధారణ అభినందన సందేశంలా కనిపిస్తున్నా ఇటీవల తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారానికి మెగాస్టార్ ఇచ్చిన గట్టి కౌంటర్‌గా ఒక సెక్షన్ మీడియా - నెటిజన్లు విశ్లేషిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ఇతరులను `తొక్కేస్తారు` అనే విధంగా (`బాస్ తొక్కేస్తాడు` అనే హ్యాష్‌ట్యాగ్‌తో) కొంతమంది నెటిజన్లు నెగెటివ్ క్యాంపెయిన్ నడపడం పెద్ద దుమారం రేపింది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత ఎమోషన్లను, వృత్తిపరమైన విషయాలను దెబ్బతీసేలా సోషల్ మీడియా ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేసింది. ఇటువంటి కక్షపూరిత ప్రచారాలను ఏమాత్రం సహించని మెగాస్టార్.. తనదైన శైలిలోనే ''ఈ పరిశ్రమ అందరిదీ.. కొందరిది మాత్రమే కాదు'' అని స్పష్టం చేస్తూ ట్రోలర్ల నోళ్లు మూయించారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అసలు చిరంజీవిపై ఇటువంటి తప్పుడు కూతలు కూయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది సగటు సినీ ప్రేమికుడి ప్రశ్న. ఒకవేళ చిరంజీవిది వేరొకరిని తొక్కివేసే స్వభావమే అయితే... పరిశ్రమలోకి వచ్చే ఎందరో చిన్న హీరోలకు, యువ నటులకు తనవంతుగా సినిమాల ప్రమోషన్లు చేస్తూ ప్రోత్సహిస్తారా? గతంలో కూడా ఆయన దానధర్మాలు చేయరని కొందరు నెగెటివ్ ప్రచారం చేసినప్పుడు.. పబ్లిసిటీకి దూరంగా లక్షలాది రూపాయల విరాళాలు ఇస్తూ.. ఎంతోమందిని ఆదుకుంటూ ప్రాక్టికల్ గా చేతల ద్వారానే జవాబిచ్చారు. రక్తదానం, నేత్రదానం సహా పలు సామాజిక సేవా కార్యక్రమాల కోసం మెగాస్టార్ తన జీవిత కాలాన్ని వెచ్చిస్తున్న విషయం తెలిసిందే.
ఇరుముడిపై ప్రశంసలు:
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన `ఇరుముడి` చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చిత్రబృందాన్ని అభినందించారు. సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి వరకు ఎంతో ఆస్వాదించానని... త్రినాథ్ పాత్రలో రవితేజ అద్భుతంగా నటించారని కొనియాడారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ భావోద్వేగాలను చక్కగా తెరకెక్కించారని.. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర నటన మెప్పించిందని ఆశీస్సులు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి చేసిన పోస్ట్‌పై రవితేజ, శివ నిర్వాణ సైతం ఎంతో ఆనందంతో ధన్యవాదాలు తెలిపారు.
మొత్తానికి `ఇరుముడి` సినిమా విజయాన్ని అభినందిస్తూనే.. తనపై కావాలని బురదజల్లే ట్రోలర్లకు - వ్యతిరేక వర్గానికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో పద్ధతిగా- నర్మగర్భంగా కౌంటర్ ఇచ్చారు. చలనచిత్ర పరిశ్రమ అనేది అందరి ఉపాధికి సంబంధించినదని.. అందరూ కలిసికట్టుగా ఎదుగుతూ ఇతరులను కూడా బతకనివ్వాలనే గొప్ప సందేశాన్ని ఆయన చాటిచెప్పారు. మెగాస్టార్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే చిరుపై కక్ష కట్టి ఇలా వ్యతిరేక ప్రచారంతో గూడుపుటానీ నడిపిస్తున్న ఆ గ్యాంగ్ ఎవరు? అనేది ఇప్పుడు మెగాభిమానులు సెర్చ్ చేస్తున్నారు.
